నగరి మార్పుపై తొలిసారి స్పందించిన రోజా!

ఏపీలో రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్. ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, కొంతమందికి సీట్లు నిరాకరిస్తున్నారు. ఇందులో మంత్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మంత్రి రోజాకు సీటు దక్కదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తొలిసారి స్పందించారు రోజా.

ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేద్దామని భావించాను కానీ జగనన్న రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారన్నారు. మొదటి నుండి ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను కాబట్టి నన్ను మార్చుతారని నేను అనుకోవడంలేదన్నారు. ఒకవేళ నా నియోజకవర్గం నుంచి నన్ను మార్చాల్సిన పరిస్థితి వస్తే సంతోషంగా త్యాగం చేస్తానని తేల్చి చెప్పారు. జగనన్న నిర్ణయమే తనకు శిరోధార్యం అన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందేనన్నారు.

మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మా పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆయన ఏం చెబితే అది చేయడానికి రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలందరం సిద్ధంగా ఉన్నాం అని తేల్చి చెప్పారు. సీటు ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునే రకం కాదని ..సీటు ఇచ్చినా, సీటు ఇవ్వకపోయినా జగన్ జెండా పట్టుకుని తిరుగుతాం అని స్పష్టం చేశారు.