హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్మెంట్లోని పార్కులో దుర్గటన చోటు చేసుకుంది. పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో బిశాన్ శర్మ(6) అనే బాలుడిపై కదులుతున్న బరువైన సిమెంట్ బెంచ్ మీద పడడంతో బాలుడి తలకు తీవ్రగాయమై చనిపోయాడు. ఈ సంఘటన బాలుడి కుటంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
స్థానికుడైన బిశాన్ శర్మ అనే ఆరేళ్ల బాలుడు పార్క్‌లోని ఓ సిమెంట్ బెంచ్‌పై కూర్చుని ఊగుతున్నాడు. అప్పటికే కొంత దెబ్బతిని ఉన్న బెంచ్ ఊగుతుండడంతో ఉత్సాహం వచ్చిన బిశాన్‌శర్మ ఊయలలా గట్టిగా ఊగడం మొదలుపెట్టాడు. కాసేపటికి బెంచ్‌కి ఉన్న ఆధారం విరిగిపోయి ఊడిపోయింది. దీంతో బాలుడు ముందుకు పడిపోగా, అతనిపై బెంచ్ పడింది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో బాలుడు చనిపోయాడు. సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు వెంటనే అక్కడికి వచ్చి బల్లను పక్కకు నెట్టినా అప్పటికే విగతజీవిగా మారాడు.
అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లలు ఆడుకునే చోట ప్రమాదకరంగా ఉన్నవాటిని తొలగించడమో, మరమ్మతు చేయడమో చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
