దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను అత్యంత ఘోరమైన పదంతో దూషించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా కనీసం తల్లులను అవమానిస్తారా అని ప్రశ్నించారు. కుల వివక్షను, అణచివేతను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్‌పై దూషణ ఘటనతో పాటు, ఎర్రవల్లిలో దళితులు నడిచారంటూ రోడ్డును పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి జరిగిన వరుస ఘటనలు, అంటరానితనం ప్రదర్శనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.
కసబ్ లాంటి ఉగ్రవాదులకు, స్పీకర్‌ను తిట్టిన వారికి ఎలాంటి తేడా లేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని అన్ని పార్టీలు కోరినా వినలేదన్నారు. దళితులు నిరసన తెలిపితే ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. నేలను కాదని, వారి మనసుల్లో ఉన్న కుళ్లును శుద్ధి చేసుకోవాలని చురకలంటించారు.
దళితులను అవమానించిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ సమగ్ర విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ వద్ద మహిళలను ఇబ్బంది పెట్టిన ఘటనపైనా విచారణ జరుపుతామని చెప్పారు. తెరవెనుక ఉండి సూచనలు చేసిన వారు, అమలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి అంశాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
