- Advertisement -

బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్‌ ఓనర్ల కన్ను!

- Advertisement -

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీ టీ20 టోర్నమెంట్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టును విక్రయించే ప్రక్రియను ప్రారంభించినట్లు సీఏ మంగళవారం ధ్రువీకరించింది. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ పురుషుల, మహిళల జట్ల యాజమాన్యంలో వంద శాతం వాటాను విక్రయించేందుకు అంగీకరించింది.

బీబీఎల్‌, మహిళల బీబీఎల్‌ 2027-28 సీజన్‌ నుంచి మెల్‌బోర్న్‌ జట్టు కొత్త చేతుల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంఛైజీల యజమానులు బీబీఎల్‌లోనూ జట్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, ‘ది హండ్రెడ్’ టోర్నీల్లో ఐపీఎల్‌ ఓనర్లు జట్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా లీగ్‌లోనూ తమ పెట్టుబడులను విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం పట్ల అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బీబీఎల్‌ అసలుసిసలు రూపం కోల్పోయి నాశనమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మాత్రం సీఏ నిర్ణయాన్ని స్వాగతించాడు. ప్రైవేటీకరణ వల్ల లీగ్‌ మరింత అభివృద్ధి చెందుతుందని, అదనపు ప్రయోజనాలు కలుగుతాయని అభిప్రాయపడ్డాడు. అయితే తనకెప్పుడూ టెస్టు క్రికెట్టే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశాడు.

మరోవైపు బీబీఎల్‌కు ఆదరణ పెంచే లక్ష్యంతో భారత్‌లోనూ మ్యాచ్‌లు నిర్వహించాలని సీఏ నిర్ణయించింది. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం (చెపాక్) స్టేడియంలో 2026-27 సీజన్‌ తొలి మ్యాచ్ జరగనుంది. డిసెంబరు 12న జరిగే ఈ ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ సంయుక్తంగా ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -