పద్మావత్ సినిమా రివ్యూ
అనేక వివాదాలు, దాడులు, ఘర్షణలతో సినిమా తెరపై పడదేమో అనుకుంటున్న సమయంలో కోర్టు తీర్పులతో ఎట్టకేలకు గురువారం (జనవరి 25) సినిమా థియేటర్లలో విడుదలైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్నిచోట్ల విడుదల కాకున్నా దక్షిణాదిన ప్రశాంతంగా ఈ సినిమా విడుదలయ్యింది. పైగా మంచి పౌరాణిక సినిమాలు తీసే సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!
కథ: అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన గురించి ఈ సినిమా ఉంది. అల్లావుద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్) అడ్డదారుల్లో సింహాసనం అధిష్టిస్తాడు. అతడు కామ పిశాచి కూడా. ప్రపంచంలో అందమైనవీ, అద్భుతమైనవన్నీ తన దగ్గరే ఉండాలని ఆశపడడం అతడి దురలవాటు. వీటికోసం ఎంతటి దుర్మార్గమైనా చేసేస్తాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా పేరు గడించిన `పద్మావతి` విషయం ఖిల్జీకి తెలుస్తుంది. ఆమె రాజ్‌పుత్ వంశానికి చెందిన వీరనారి. అప్పటికే ఓ రాజ్‌పుత్ రాజుకు భార్య. పెళ్లయినా పరవాలేదు తనకు కావాలని, ఆమెను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. ఈ సందర్భంగా ఆమె కోసం రాజపుత్‌లపై యుద్ధం ప్రకటిస్తాడు. పద్మావతిని దక్కించుకోవడానికి ఖిల్జీ చేసిన ప్రయత్నాలు… పద్మావతిని కాపాడుకోవడానికి రాజ్‌పుత్‌లు చేసిన యుద్ధం? పద్మావతి పాత్ర ఏంటి? అనేవి తెరపై చూడాల్సిందే!
ఈ సినిమాలో మంచి భావోద్వేగాలతో కూడిన సినిమా. వీటన్నింటినీ తనదైన శైలిలో దర్శకుడు భన్సాలీ తీశారు. యుద్దాలు, యాక్షన్ సీన్స్, కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలు ఎక్కువ లేకుండా సాధారణంగా సినిమా తీశాడు. వాటిని పక్కన పెట్టి తనకు పట్టున్న వీలైనంత డ్రామా ఎలివేట్ చేయడానికి చూశాడు. ఖిల్జీ అరాచకత్వం, అతడి ఆలోచనలు, సింహాసనాన్ని అడ్డదారిలో అందుకున్న విధానం.. వీటితో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది.
సులభంగా కథను అర్థమయ్యేలా తీశారు. చరిత్ర తెలియని వాళ్లు కూడా సినిమాలో మునుగుతాడు. 800 మంది దాసీలతో పద్మావతి ఖిల్జీలపైకి దండెత్తే సన్నివేశంలో భన్సాలీ దర్శకత్వ ప్రతిభ అణువణువూ కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో రాజ్‌పుత్‌ల త్యాగాన్ని బాగా ఎలివేట్ చేశారు. తొలిభాగంలో కథ చెప్పడానికి, పాత్రల్ని పరిచయం చేయడానికి సమయం పట్టింది. ద్వితీయార్ధంలో డ్రామాని పండించి… తనదైన మార్క్ వేయగలిగాడు. చరిత్రను వక్రీకరించకుండా తనదైన శైలిలో తీశాడు. సెన్సార్‌తో చాలాచోట్ల కథ జంప్ అయినట్లు కనిపిస్తుంటుంది.
రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, షాహీద్ కపూర్ పాత్రల్లో జీవించారు. రణ్‌వీర్‌సింగ్‌కి క్రూరత్వ పాత్రలో అదరగొట్టాడు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. రాజ దర్బార్, కోటలు విస్తుపోయేలా ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్స్ కూడా సహజంగా ఉంది.
నటీనటులు: దీపికా పదుకొణె, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలి
నిర్మాత: సంజయ్ లీలా భన్సాలి.. సుధాన్సు వాట్స్.. అజిత్
సంగీతం: సంజయ్ లీలా భన్సాలి, సంచిత్ బల్హారా