గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ఫోటోతో ఉన్న ఆ గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు.
ఇక ఈ గోల్డ్ కార్డును మొదట తానే కొనుగోలు చేసినట్లు ప్రకటించారు ట్రంప్ . డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు పౌరసత్వం అన్నారు. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో రూ.43.5 కోట్లు చెల్లించి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసినవారికి నేరుగా అమెరికా పౌరసత్వం లభించనుంది.
ఈ గోల్డ్ కార్డు రెండువారాల్లో మార్కెట్లోకి రానుంది. ఈ గోల్డ్ కార్డు సంపన్న విదేశీయులకు అమెరికా రెసిడెన్సీ మరియు పౌరసత్వాన్ని కల్పించనుంది. ఇది గ్రీన్ కార్డ్ లాంటిదే కానీ మరింత అధిక ప్రాముఖ్యత కలిగిఉందని తెలిపారు ట్రంప్.
1990లో ప్రారంభమైన EB-5 ప్రోగ్రామ్ ద్వారా $1 మిలియన్ (లేదా తక్కువ ఆదాయ గల ప్రాంతాల్లో $800,000) పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించిన విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండేది. 2024లో సుమారు 4,500 EB-5 వీసాలు మంజూరయ్యాయి. ఇప్పుడు, గోల్డ్ కార్డ్ దారులకు రెసిడెన్సీ లాభాలు (Green Card హోల్డర్లకు ఉన్న ప్రయోజనాలతో సమానం) అందుతాయి. అయితే పౌరసత్వానికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇంకా వెల్లడించలేదు.