త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించింది తెలంగాణ బీజేపీ. ఇందులో భాగంగా ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించగా కనీసం 10 స్థానాలైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై అంచనాకు రాగా తాజాగా చేరికలపై దృష్టి సారించింది. ఇప్పటికే చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్ ఉండగా మళ్లీ కమిటీని రీ యాక్టివేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇక బీజేపీ నుండి మల్కాజ్‌గిరి స్థానాన్ని ఆశీస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ ఖర్చీఫ్ వేసుకుని కూర్చోగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ అధినేత సైతం రేసులో ఉన్నారు. ఇక తాజాగా మరో పేరు వినిపిస్తోంది. స్వామి పరిపూర్ణానందను పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు పరిపూర్ణానంద. ప్రధానంగా బీజేపీ అగ్రనాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్కాజ్ గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరును ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ పరిపూర్ణానంద పోటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై త్వరలోనే అఫిషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.