అప్పుడే బిహార్ లో భారతీయ జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రి పదవికి పోటీ మొదలైంది.
ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే వేడెక్కిన బిహార్ రాజకీయాల్లో ఇది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే బిహార్ కు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించాడు మోడీ. ఆ రాష్ట్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మోడీ అలా చేశాడనే విమర్శలు వస్తున్నాయి. అయినా వాటిని ఆయన లెక్క చేయడం లేదు.
ఎందుకంటే ఇప్పుడు బిహార్ లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడమే ఆయన లక్ష్యం. తన ప్రియమైన శత్రవు అయిన నితీశ్ కుమార్ కు ఆ విధంగా చెక్ చెప్పాలని మోడీ భావిస్తున్నాడు. అందు కోసమే ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్నాడు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకనే ఇప్పటికే పలు మార్లుగా మోడీ బిహార్ ను సందర్శించాడు. మరి ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇక్కడ బీజేపీ కూటమి గనుక అధికారాన్ని సొంతం చేసుకొనే పరిస్థితి వస్తే.. సీఎం పీఠం తనదే అంటున్నాడు రామ్ విలాస్ పాశ్వాన్.
లోక్ జనశక్తి పార్టీకి చెందిన పాశ్వాన్ ఎన్డీయేలో భాగస్వామిగా కేంద్రమంత్రిగా ఉన్నాడు. గతంలో తనను బిహార్ ముఖ్యమంత్రిగా చేస్తానని వాజ్ పాయి హామీ ఇచ్చాడని.. ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని ఈయన అడుగుతున్నాడు. అయితే ఇది వాజ్ పాయి హయాం కాదు.. మోడీ హయాం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్ కు అనుకూలుడిగా… యూపీఏలో భాగస్వామిగా ఉన్న పాశ్వాన్ కు మోడీ కేంద్రమంత్రిగా చాన్స్ ఇవ్వడమే ఎక్కువ అలాంటిది.. బిహార్ కు ముఖ్యమంత్రిగా చేస్తాడా?