తిరుమల తిరుపతి దేవస్థానం లక్షలాది భక్తులు వచ్చే ఆలయం. భారతదేశంలోనే ఎంతో చరిత్ర, భారీ ఆదాయం గల ఆలయం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పోస్టు అంటే ఓ మంత్రి పదవిలాంటిది. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ సీటుకు మహామహానుభావులు పోటీపడుతుంటారు. స్వామివారి సేవ కోసమని, తాము కొంత వెనకేసుకొచ్చనే ఆశతో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెగ ఆరాటపడుతున్నారు.
ఏడాదిగా ఆ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ కుర్చీలో కూర్చోవడానికి తలపండిన రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే చంద్రబాబు ఎవరిపై ఆసక్తి చూపుతారో తెలియదు. కానీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఎంపికయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన కొట్టివేశారు.
‘నేను తి.తి.దే ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నానని వార్తలు వస్తుండడంతో వేలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. ఎస్వీఎస్సీ చానెల్ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నా. శ్రీవారికి చెందిన కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది నా కోరిక.’ అని దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు.
అయితే రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఆసక్తి ఉన్నది లేనిది చెప్పలేదు. కొట్టి వేయడం లేదంటే ఆయనకు ఆసక్తి ఉన్నట్టే అర్థం. రాఘవేంద్రరావు వెంకటేశ్వరస్వామి నేపథ్యంలో ‘అన్నమయ్య’, ‘నమో వేంకటేశాయ’ సినిమాలు తెరకెక్కించారు.