తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అసలే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేక వాటిని చక్కదిద్దేందుకు పాలకులు మల్లగుల్లాలు పడుతుంటే ఓ యువకుడి చికెన్ బిర్యానీ ఆవేదన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో ప్రజల సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆయనతో ట్విట్టర్ లో తమ బాధలు షేర్ చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ చేస్తున్న పనికి ఎంతో మంది నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు ట్విటర్ వేదికగా తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది. ట్విటర్ యూజర్ జొమాటోలో ఓ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసే ముందే ఇన్‌స్ట్రక్షన్స్‌లో తనకు చికెన్ బిర్యానీ బాగా స్పైసీగా కావాలని, కలర్ ఫుల్‌గా కావాలని సూచించాడు. ఫుడ్ డెలివరీ అయింది. తెరిచి చూస్తే ఆ చికెన్ బిర్యానీ కలర్ ఫుల్‌గా కాదు కదా.. పాలిపోయిన రంగులో ఉంది.
బిర్యానీ లో అదనపు మసాలతో పాటు లెగ్ పీస్ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలు అందించడం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో మంత్రి కేటీఆర్ స్మార్ట్ గా ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చాడు. ‘ఈ బిర్యానీ విషయంలో నేనేం చేయగలను బ్రదర్. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే, గమనించిన సదరు యువకుడు వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేసేశాడు.
ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ స్పందనపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై తనదైన స్టైల్లో ఫన్నీగా కామెంట్ చేశారు. కేటీఆర్ ఆఫీస్.. దీనిపై కచ్చితంగా స్పందించండి. కేటీఆర్, ఆయన టీమ్ ఈ పాండమిక్ సమయంలో ప్రజల మెడికల్ అవసరాలను తీరుస్తున్నామని చాటుకోండి అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఈ ట్విట్ గోల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
