ఏపీ వాసులకు శుభవార్త. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధికారిక ప్రకటన చేశారు.
విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ జోన్ కు ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేసినట్టు చెప్పారు. రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేస్తామని, భాగస్వాములు అందరితో చర్చించామని, ఈ దిశగా అధికారిక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు విషయాన్ని మెల్లిగా వెల్లడించారు గోయల్. రైల్వేజోన్ పై విస్తృతంగా అధ్యయనం చేశామని, వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజిస్తామని, ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్ గా మారుస్తున్నామని, ఈ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్ లో భాగంగా ఉంటుందన్నారు. వాల్తేరు డివిజన్ లోని ఏపీ స్టేషన్లతో పాటు విజయవాడ – గుంటూరు – గుంతకల్ డివిజన్లతో ఈ జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు గోయల్. ఇక్కడే ఓ చిన్న వివాదం తలెత్తింది. ఆదాయం వచ్చే గూడ్స్ రవాణ మొత్తం రాయగఢకు వెళ్తుందని.. ఇది సరికాదని కొందరు పెదవి విరుస్తున్నారు.
మరోవైపు అయితే, కొత్తగా ఏర్పడే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఆదాయానికి గండికొట్టడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు ఉండగా, విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుతో మూడు మాత్రమే మిగలనున్నాయి. మూడు రాష్ట్రాల్లో విస్తరించి, ఏటా రూ. 11 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తున్న దక్షిణ మధ్య రైల్వే, ఇకపై రూ. 6 వేల కోట్ల ఆదాయానికి పరిమితం కానుంది.
అంతేకాకుండా మరో రెండు రోజుల్లో ఏపీ పర్యటనకు మోదీ రానున్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటన రావడం కూడా ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదన్న భావనతోనే మోదీ సర్కారు.. విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించిందన్న వాదనా వినిపిస్తోంది.