యూఏఈలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ శనివారం మోదీని ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ మెడల్‌తో సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే ఈ అవార్డు యూఏఈలోనే అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం.
2015లో అరబ్ దేశాల్లో పర్యటించిన మోదీ ఇరుదేశాల మధ్య మత, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో చేసిన కృషికిగాను ఈ అవార్డును ఇస్తున్నట్టు గత ఏప్రిల్‌లోనే యూఏఈ ప్రకటించింది. ఈ అవార్డును యుఏఇ జాతిపిత షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరుతో ఇస్తారు. ఆయన శతజయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం విశేషం.
ఇంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య 60 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. దీనిపై మోదీ స్పందిస్తూ, 130 కోట్ల మంది భారతీయులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వ్యక్తిగా కంటే దేశ సాంస్కృతిక వైభవానికి దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తానని తెలిపారు.