Saturday, June 8, 2024
- Advertisement -

చంద్రబాబు ముందే టీడీపీ నేతల తోక జాడింపులు

- Advertisement -

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంటే ఆ పార్టీ నేతలకు గౌరవం తగ్గుతోందా ? ఒకప్పుడు బాబు పేరు చెబితేనే అలర్ట్ అయిపోయే నేతలు ఇప్పుడు తోక జాడిస్తున్నారా ? చిన్న విషయాలకూ పెద్ద విషయాలకు పార్టీ అధినేతనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? చంద్రబాబు మెతకవైఖరే అందుకు కారణమా ? అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

ఒకప్పుడు చంద్రబాబు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల వెన్నులో వణుకు ఉండేది. పార్టీలో ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణతో మెలగేవారు. రాముడు మంచి బాలుడు అనే కోణంలో ఆయన దృష్టిలో పడాలని తాపత్రయపడేవారు. బాబుగారి అనుగ్రహం ఉంటే చాలు అదే పదివేలు, ఆగ్రహానికి గురైతే ఇక అంతే సంగతులు అని భావించేవారు. తెలిసో తెలియకో తమతమ నియోజకవర్గాల్లో చేసిన తప్పులు, తమ మీద వచ్చిన ఆరోపణలకు చంద్రబాబుకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తే గజగజ వణికిపోయేవారు. ఆయన వేసే అక్షింతలను గుర్తు తెచ్చుకుని ఇటు సొంత నియోజకవర్గాల్లో, అటు పార్టీలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు అంటే టీడీపీ నేతలకు సింహస్వప్నం.

కానీ కొన్నాళ్లుగా టీడీపీలో చిన్నాపెద్దా నేతల స్వరం మారుతోంది. అయినదానికీ కానిదానికీ గొంతు లేస్తోంది. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలు బేఖాతర్ అనే పరిస్థితి రోజురోజుకూ పెరుగుతోంది. టీడీపీలో ఏ అంతర్గత కలహాలు వచ్చినా పంచాయతీ నేరుగా చంద్రబాబు వద్దకే వెళ్తోంది. ముఖ్యమంత్రిగా అంత బిజీ షెడ్యూల్ లోనూ స్వయంగా ఆయన జోక్యం చేసుకుంటే కానీ పరిస్థితి చక్కబడటం లేదు. తెలుగు తమ్ముళ్లు బరితెగింపు ఒక్కోసారి పార్టీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తోంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, కాల్ మనీ, మంత్రిపదవులు ఇలా అనేక అంశాల్లో టీడీపీ నేతలు ఈ మధ్య రోడ్డు మీదకు వస్తున్నారు. పార్టీ సమావేశాల్లో మాట్లాడి తేల్చుకోవాల్సిన అంశాలనూ బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ తొడకొడుతున్నారు.

ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని కొట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ టీడీపీ పరువును గంగపాలు చేసింది. అప్పుడే ఆయనపై చంద్రబాబు వేటు వేయాల్సింది కానీ కాపాడారు. అయినా చింతమనేని తగ్గలేదు. తర్వాత జరిగిన మంత్రిపదవుల పంపకాల్లో తనకు అవకాశమివ్వలేదని విరుచుకుపడ్డారు. అవసరమైతే టీడీపీకి గుడ్ బై చెప్పేసి, సొంత పార్టీ పెడతానని మీసం మెలేసి తొడగొట్టారు. చింతమనేనికి పార్టీ పెట్టేంత సీన్ ఉందా….? లేదా ? అన్నది పక్కన పెడితే చంద్రబాబుకి వ్యతిరేకంగా అంత దూకుడుగా మాట్లాడటం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

అసెంబ్లీ సమావేశాల్లో తొడగొట్టిన మరో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఏరా నరికేస్తా… నీ అంతు చూస్తా…ఇక్కడే పాతేస్తా… రారా బయటకు రా చూసుకుందాం…అంటూ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కొడాలి నానిపై రెచ్చిపోయారు. సభలో అమర్యాదగా ప్రవర్తించినందుకు చంద్రబాబు ఏమీ అనలేదేమో,! దీంతో ఈయన కూడా తర్వాత తనకు మంత్రి పదవి ఇవ్వలేదని అలకబూనారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడో లేదో అప్పుడే తనకు మంత్రి పదవి ఇచ్చేయాలని నానా యాగీ చేేేసేశారు. కాపు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని, ముద్రగడ పద్మనాభంతో కలిసి కన్నెర్రజేశారు. చివరకు పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించి నీ కబ్జా బాగోతం ఫైలు మొత్తం నా వద్ద ఉంది. మంత్రి పదవి అడిగావు సరే. ముద్రగడతో కలసి కాపు ఉద్యమం, అన్యాయం అంటూ ఏదేదో వాగుతున్నావేంటి ? అని గట్టిగా మందలించేసరికి, తన కబ్జాలు, అక్రమాస్తులు, వ్యాపారుల గురించి వార్నింగ్ ఇచ్చేసరికి వెనక్కి తగ్గి, కాళ్ల బేరానికి వచ్చారని టీడీపీ వర్గాల నుంచే వార్తలు వచ్చాయి.

విజయవాడ ఎంపీ కేశినేని నానీ కూడా ఆ మధ్య చంద్రబాబు ముందే తలెగరేశారు. కేశినేని ట్రావెల్స్ వివాదంతో పాటు, విజయవాడలో స్థలం కబ్జా ఆరోపణలపై ఆయన పార్టీ నేతలపై శివాలెత్తిపోయారు. కేశినేని ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆర్టీఓ కమిషనర్ రిపోర్టుపై అంతెత్తున లేచారు. ఆర్టీఓ ఆఫీస్ పైనా కమిషనర్ పైనా నానీ అనుచరులతో కలిసి దాడికి దిగారు. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు వరకూ పంచాయతీ వెళ్లడంతో నానీతో కమిషనర్ కి క్షమాపణ చెప్పించారు. అధికారుల పట్ల అలా వ్యవహరించకూడదని సున్నితంగానే బాబు చెప్పినా నానీ బ్యాచ్ తగ్గలేదు. మొత్తం కేశినేని ట్రావెల్స్ బస్సులను అమ్మేస్తాం. వ్యాపారం మానేస్తాం. అంటూ హడావుడి చేశారు. చివరకు కొందరు టీడీపీ నేతల జోక్యంతో సైలెంట్ అయిపోయారు. కానీ ఆ ఎపిసోడ్ లో పార్టీ అధ్యక్షుడు చెప్పినా నానీ చేసి రచ్చ అంతా ఇంతా కాదు.

పార్టీ మరో సీనియర్ నాయకుడు రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఈయన మంత్రి పదవికి అర్హుడే. టీడీపీ పుట్టినప్పటి నుంచీ ఉన్నవాడే. కానీ మొన్న మంత్రి పదవి దక్కలేదని బాబుపై తీవ్రంగా మండిపడ్డారు. తన ఆక్రోషాన్ని బహిరంగంగానే వెళ్లగక్కేశారు. అసలు ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ టీడీపీ కాదని తేల్చేశారు. ఎవడెవడో వస్తున్నాడు మంత్రి అవుతున్నాడు. ఆయారాం గయారాం పార్టీలా టీడీపీని చంద్రబాబు భ్రష్టు పట్టించారని బుచ్చయ్యచౌదరి నిప్పులు చెరిగారు. తన లాంటి సీనియర్లకు, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారని ఆయన కస్సుబుస్సులాడారు. చివరికి ఆయన కూడా అనేక బుజ్జగింపులతో చల్లబడ్డారు.

ఈ మధ్య మంత్రి గంటా శ్రీనివాసరావు చంద్రబాబుపై తన బ్లాక్ మెయిల్ పోలటిక్స్ ప్లే చేశారు. కాంగ్రెస్, పీఆర్పీ, టీడీపీ ఇలా ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీ మారే గంటా చూపు ఇప్పుడు జనసేన వైపు పడుతోంది. కాపు సామాజికవర్గం, చిరంజీవితో పాత స్నేహం, ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి ఉన్న జనాధరణ చూసి గంటా జనసేనలోకి జంపింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ టీడీపీలో తనకి, తన వర్గానికి అన్యాయం జరిగిపోతోందని, విశాఖ జిల్లాలో తన ప్రధాన పోటీదారుడైన అయ్యన్నపాత్రుడు వర్గానికి బాబు ప్రాధాన్యం ఇస్తున్నారని అలకబూనారు. తన వర్గం వారిని టీడీపీ తొక్కేస్తున్నారంటూ ఈయన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈయన పార్టీ మారేందుకే బురద జల్లుతున్నారని పసిగట్టిన చంద్రబాబు అందుకు తగ్గ మంత్రం వేసి గంటాను అలకపాన్పు నుంచి దించారు. ప్రస్తుతానికి బుజ్జగింపులతో నెట్టుకొస్తున్నారు.

వీళ్లే కాదు ఇంకా చాలామంది టీడీపీ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. దానికి ప్రధానం కారణం ఈ మధ్య చంద్రబాబులో వచ్చిన తీవ్ర మార్పే. ఆయన మెతకవైఖరి వల్లే తెలుగు తమ్ముళ్లు కాలరెగేరేస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో గట్టిగా వార్నింగ్ ఇస్తే పార్టీ నుంచి జంపయిపోతారనే చంద్రబాబు కొంతవరకూ వెనక్కి తగ్గుతున్నారు. దీనికి తోడు చాలామంది టీడీపీ నేతలు వివిధ మార్గాల్లో డబ్బులు బాగానే కూడబెట్టారు. దీంతో స్వతహాగానే వారి స్వరంలో మార్పు వస్తోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు సున్నితంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో చులకనవుతున్నారు. సో ఇకనైనా మళ్లీ పాత చంద్రబాబు వస్తే టీడీపీ నేతలు తోక జాడించడాలు తగ్గుతాయి. ఆయన కొరడా ఝళిపిస్తేనే వీరు దారిలోకి వచ్చేది. లేదంటే రోజుకో పంచాయతీ తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -