Saturday, May 18, 2024
- Advertisement -

చంద్రబాబు ప్రభుత్వాన్ని ముంచేస్తున్న పడవలు

- Advertisement -

మూడేళ్లుగా సాఫీగా సాగిపోతున్న చంద్రబాబు ప్రభుత్వానికి గతేడాది నవంబర్ లో కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంతో కుదుపు వచ్చింది. విజయవాడలోని కృష్ణానది పవిత్రసంగమం వద్ద బోటు నీట మునిగిపోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది. టూరిజం శాఖ వైఫల్యాలు బట్టబయలయ్యాయి. టూరిజం శాఖ మంత్రి ఏం చేస్తున్నారని భూమా అఖిలప్రియతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్షం విరుచుకుపడింది. ఆ ఘటన ప్రభుత్వ ప్రతిష్ఠను మంటగలిపింది.

ఆ దుర్ఘటన మరిచిపోక ముందే ఈ ఏడాది గత మే నెలలో గోదావరి నదిలో లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం నుంచి కొండమొదలకు వెళ్తున్న లాంచీ మంటూరు వద్ద జలసమాధి అయిపోయింది. ఆ విషాద ఘటనలో 19 మంది గిరిపుత్రులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ? అని మండిపడింది.

అదే మే నెలలో 120 మంది టూరిస్టులతో పాపికొండలు వెళ్తున్న బోటు నుంచి ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. అయితే బోటు డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులను క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో పెను ప్రమాదమే తప్పింది. ప్రయాణికులు కంగారు పడి నదిలో దూకేయకుండా, వారికి ఓ వైపు లైఫ్ జాకెట్లు ఇస్తూ, మరోవైపు ధైర్యం చెబుతూ బోటును క్షణాల్లో ఒడ్డుకు చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. బోటు మంటలకు ఆహుతైనా టూరిస్టుల ప్రాణాల దక్కాయి.

ఈ వరుస దుర్ఘటనల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్వకముందే మరో విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. 40 మందితో గోదారి దాటుతుండగా పడవ బోల్తాపడింది. స్థానికులు వెంటనే స్పందించి 33 మందిని కాపాడారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులు, ఓ మహిళ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదారి పోటుతో పాటు, భారీ వర్షం వల్ల సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. గల్లంతైన వారిలో పెద్దవారికి 5 లక్షల రూపాయలు, పిల్లలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చంద్రబాబు ప్రకటించారు.

అయితే సరిగ్గా ఏడాది కూడా గడవకముందే నాలుగు ప్రమాదాలు జరగడంతో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పాలకులు, ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యానికి తాము మూల్యం చెల్లిస్తున్నామని మండిపడుతున్నారు. నష్టం జరిగాక పరిహారం ప్రకటించే బదులు ముందే మేల్కొని వంతెనలు నిర్మించవచ్చు కదా ? అని కోరుతున్నారు. వీరికి మద్దతుగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

కేరళ వంటి ప్రాంతాల్లో నిత్యం జనం బోట్లు, నాటు పడవలు మీదే బతుకుతుంటారు. ఆట, పాట, వంట, వార్పు, టూరిజం, చేపల వేట, ఇలా వారి బతుకులు నదులతో ముడిపడి ఉన్నాయి. కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఏ రకమైన పడవ నదిలోకి వెళ్లినా సరిపడా లైఫ్ జాకెట్లు ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగడం లేదు. వారిని చూసైనా, అక్కడి పరిస్థితులను స్టడీ చేసైనా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం లైఫ్ జాకెట్లుతో పాటు ఇతర చర్యలూ చేపట్టాల్సిన అవసరముంది. లేదంటే మునిగిపోయేది జనమే కాదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం కూడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -