సిబ్బందిపై అసభ్య పదజాంతో తిడుతూ దాడి
టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతనిధుల ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్న రెండో భార్యను హింసించడం.. నిన్న నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్‌లో ఓ అధికారిని బండ బూతులు తిట్టడం.. ఈరోజు ప్రభుత్వ సిబ్బందిపై దాడి చేయడం కనిపించాయి. వీరు అధికారం ఉందని రెచ్చిపోతూ వారి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇంతకేమైందంటే..
కరీంనగర్ జిల్లా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బోడిగె శోభ. ఆమె చొప్పదండి నుంచి హైదరాబాద్ వస్తుంటే మధ్యలో తిమ్మాపూర్ మండలంలో రేణికుంట టోల్‌గేట్ ఉంది. అయితే ఆ టోల్‌గేట్ వద్ద వీఐపీలు వెళ్లే మార్గంలో ఓ వాహనం రిపేర్‌కు వచ్చి అక్కడే ఉండిపోయింది. దీంతో సిబ్బంది వీఐపీలను కూడా సాధారణ ప్రజలు వెళ్లే మార్గంలో వెళ్లమని చెప్పారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వాహనం కూడా వచ్చింది. వీరిని కూడా సాధారణ ప్రజల మార్గంలో వెళ్లమని సిబ్బంది చెప్పారు. దీనిపై ఇక ఎమ్మెల్యే శివాలెత్తింది. టీఆర్ఎస్ నాయకులు, ఆమె అనుచరులు టోల్‌గేట్ వద్ద చిందులు వేసినట్లుగా వేశారు.
వీఐపీ వాహనాల్ని ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు. తమను వీఐపీగా గుర్తించరా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే శోభ.. ఆమె అనుచరుల వ్యవహారాన్ని టోల్ సిబ్బంది ఫోన్‌లో వీడియో తీయడంపై మరింత ఆగ్రహం చెంది వీడియో తీస్తున్న ఫోన్లను లాక్కుని వెళ్లారు. ఈ ఘటనపై టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ సెల్‌ఫోన్ లాక్కున్నారు.