ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర చివరకు చేరింది. ఈనెల 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగసభతో ముగుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తికానుందని ఆయన తెలిపారు. ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు 134 నియోజవకర్గల్లో 120 బహిరంగ సభలు, రెండువేలకుపైగా గ్రామాలు, 3500 కి.మీ.పైగా పాదయాత్ర సాగిందని వివరించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఈ సందర్భంగా తెలిపారు. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తారన్నారు.
గడిచిన పదేళ్లల్లో ఊహించని సమస్యలు, అక్రమ కేసులు, జైలు జీవితం, హత్యాయత్నం వరకు ఎన్నో కష్టాలను జగన్ చవిచూశారు. 2019 కొత్త సంవత్సరం జగన్ నామ సంవత్సరం అని తెలిపారు. పాదయాత్రలో ప్రజలు కష్టాలు విన్నారని, వారి సమస్యలకు భరో ఇస్తూ పాదయాత్ర కొనసాగిందని తెలిపారు.