నవరత్నాల పథకాలను ప్రతీ ఇంటికి చేరాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు జగన్. అలా అయితేనే కపటబుద్దిగల చంద్రబాబును అడ్డుకోవచ్చన్నారు. నవరత్నాలతో ప్రతీ కుటుంబానికి ఎలాంటి మేలు కలుగుతుందనే అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలని జగన్ పేర్కొన్నారు. ప్రజలందరి నోళ్లలో నవరత్నాలు నానేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు వైసీపీ ఇచ్చిన హామీలు ‘నవరత్నాలు’ పోస్టర్ ను అధినేత జగన్ ఈరోజు ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖపట్టణంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘నవరత్నాలు’ అధికారిక పోస్టర్ ను జగన్ విడుదల చేశారు.వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఈ పోస్టర్ అందుబాటులో ఉంటుందని, ప్రతి కార్యకర్త దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని జగన్ అన్నారు.
అంతకుముందు జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణపై నియోజకవర్గ సమన్వయకర్తలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు దిశానిర్దేశం చేశారు. మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో.. జనవరి నాటికి సర్వం సిద్ధంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.
ప్రతీ నియోజకవర్గ సమన్వయకర్త.. ప్రతిరోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని జగన్ పేర్కొన్నారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పాటు ఆయా బూత్‌లకు చెందిన కార్యకర్తలు ఆయా కుటుంబాలతో మమేకం కావాలని ఆదేశించారు.