ఓడలు బళ్లు, బళ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో! ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్ ఇప్పుడు కుదేలయిపోయింది.
కనీసం టోర్నీల్లో ఆడటానికి అర్హత సంపాదించడానికి కూడా ముప్పుతిప్పలు పడుతోంది. క్రికెట్ లో వెస్టిండీస్ స్వర్ణయుగం గురించి వేరే చెప్పనక్కర్లేదు. తొలి, మలి ప్రపంచకప్ ల విజేత అయిన విండీస్ .. మూడో ప్రపంచకప్ లో కూడా ఫైనల్ వరకూ వచ్చి ఇండియా చేతిలో ఓడిపోయింది. ఇక కేవలం ప్రపంచకప్ ల విషయంలోనే కాదు.. ఆట విషయంలోనూ.. పేరున్న ఆటగాళ్లను అందించడంలోనూ విండీస్ కు తిరుగే లేదు. మరి అంత నేపథ్యంలో ఉన్న జట్టుకు ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది.
వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అర్హత కోల్పోయింది వెస్టిండీస్ జట్టు… దీంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారు. క్రికెట్ ను ఎంతగానో ఆదరించే వారు తమ జట్టు ఎదుర్కొంటున్న స్థితిని చూసి మదనపడుతున్నారు. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 8 కి మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని ఇచ్చింది ఐసీసీ. అయితే ప్రస్తుతం విండీస్ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. దీంతో దానికి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. విండీస్ ను కిందకు తోసి.. ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించిన బంగ్లాదేశ్ మాత్రం వచ్ఛే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది.
చివరిసారిగా 2006లో వెస్టిండీస్ జట్టు మినీ వరల్డ్ కప్ గా పిలిచే ఈ ట్రోఫీని గెలుచుకొంది. అంతర్జాతీయ స్థాయి ట్రోఫీల్లో విండీస్… చివరిసారిగా గెలిచిన ట్రోఫీ కూడా అదే. ఇప్పుడు అదే ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కోల్పోయింది వెస్టిండీస్ జట్టు.