ఆసియా కప్ 2023లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుండగా ఇందులో గెలిచిన జట్టు భారత్‌తో ఫైనల్లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం శ్రీలంక – పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు భారత ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మళ్లీ దాయాదుల పోరు ఉండనుంది. ఇదే జరిగితే ఆసియా కప్ చరిత్రలోనే ఫైనల్లో భారత్ – పాక్ తలపడటం తొలిసారి కానుంది.
అయితే కీలక పోరుకు ముందు పాకిస్థాన్‌కు గాయాలు వేధిస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, నసీమా షా, సల్మాన్ అఘాలు భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడగా నసీమ్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో శ్రీలంకతో మ్యాచ్‌కు 5 మార్పులతో జట్టును ప్రకటించింది పాక్. ఫాం లేని కారణంగా ఫకర్ జమాన్, హీం అష్రఫ్‌లు జట్టుకు దూరం కాగా వీరి స్ధానంలో హారిస్, నవాజ్‌లు చేరారు. ఇక శ్రీలంక తమకు అచ్చొచ్చిన స్పిన్‌పైనే ఆశలు పెట్టుకుంది. కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుండగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే శ్రీలంక మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫైనల్‌కు చేరనుంది.
పాకిస్థాన్ జట్టు:
ఇమాముల్ హక్, మహమ్మద్ హారిస్, బాబర్ ఆజమ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్టికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, మహమ్మద్ వసీం జూనియర్
శ్రీలంక(అంచనా):
కుశాల్ మెండిస్, దసున్ శనక(కెప్టెన్), పతుమ్ నిశాంక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, దిముత్ కరుణరత్నే, ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, తీక్షణ, మతీషా పతిరానా, కసున్ రజిత