బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ప్రపంచం ముందు దోషిగా నిలబడిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు. సిడ్నీ చేరుకున్నాక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన స్మిత్.. ఉద్వేగం ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. తప్పు చేశాను క్షమించండంటూ ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను వేడుకున్నాడు. దేశాన్ని తలదించుకునేలా చేసినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు.
కెప్టెన్గా జరిగిన పరిణామాలకు పూర్తి తనదే బాధ్యత అని, తనను క్షమించాలని అతను కోరాడు. నాయకుడిగా తాను పూర్తిగా విఫలమయ్యానని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందంటూ అతను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా అతను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.
నాకు జరిగిన ఈ నష్టం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా’ అని స్మిత్ గద్గద స్వరం స్వరంతో చెప్పుకొచ్చాడు. ఈ వివాదం జీవితాంతం నన్ను వెంటాడుతుంది’ అంటూ స్మిత్ భావోద్వేగంగా మాట్లాడాడు.