ఈ రోజు సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను ‘కావేరీ’ నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. స్టేడియం పరిసరాల్లో గందరగోళం చెలరేగకుండా చర్యలు తీసుకోవాలని సూచించాయి.
అయితే కావేరీ జల వివాదం నేపథ్యంలో తమిళనాడులో తీవ్రతరమైన నిరసన ఇప్పుడు ఈ మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. ఇప్పటికే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు ఐపీఎల్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తమిళనాడు ప్రజలు చేపట్టిన నిరసనకు చెన్నై సూపర్ కింగ్స్ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే చెపాక్ స్టేడియం బయట ఆందోళనలు మొదలైపోయాయి.
మరోపక్క, చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని తమిళనాడు ప్రజలు, నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలో పాముల్ని వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్ హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించే చెపాక్ స్టేడియం వద్ద 4 వేల మంది పోలీసులతో భద్రతను పెంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నల్ల దుస్తులు వేసుకొచ్చేవారిని స్టేడియంలోకి అనుమతించమని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అలాగే చెన్నైలోని మ్యాచ్‌లన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండదని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కె.ఎస్. విశ్వనాథన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి సాయంత్రం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.