రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి కోసం కన్నతల్లిని అతి కిరాతకంగా అంతమొందించిన కుమార్తె ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తల్లి మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఆయుషి అనే యువతి, పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించింది.
ప్రతాప్‌నగర్‌లోని రవీంద్రనగర్‌కు చెందిన నీరజ్ శర్మ (45) ఏడాది క్రితం భర్తను కోల్పోయారు. భర్త మరణానంతరం ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ఆమెకు కోర్టులో ఎల్‌డీసీ ఉద్యోగం ఇచ్చింది. అయితే, ఆ ఉద్యోగం తనకు కావాలని కుమార్తె ఆయుషి తల్లితో గొడవపడింది. తల్లి అందుకు అంగీకరించకపోవడంతో ఆయుషి తీవ్ర కక్ష పెంచుకుంది.
ఉద్యోగంతో పాటు ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాసుకోవాలని ఆయుషి పథకం వేసింది. ఇందులో భాగంగా తన సమీప బంధువులతో కలిసి తల్లిని చంపడానికి భారీ కుట్ర పన్నింది. ఈ నెల 23న నీరజ్ శర్మ ప్రయాణిస్తున్న కారును, ముందస్తు ప్రణాళిక ప్రకారం బంధువుల కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నీరజ్ శర్మ అక్కడికక్కడే మరణించారు. ఘటనను చూసిన ఎవరికీ అనుమానం రాకుండా, అదొక సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
ప్రమాదం జరిగిన తీరుపై మృతురాలి సోదరుడు రాకేశ్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. ఆయుషి ప్రవర్తన, ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆస్తి, ఉద్యోగ వ్యామోహంతోనే కుమార్తె తన తల్లిని బంధువులతో కలిసి హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి ఆయుషితో పాటు ఆమెకు సహకరించిన ఆరుగురు బంధువులను పోలీసులు అరెస్టు చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ రంజిత్ శర్మ వెల్లడించారు. కన్నతల్లిని బలితీసుకున్న ఆయుషి దుర్బుద్ధిని చూసి స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
