కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలకు సిద్దం అవుతోంది. పార్లమెంట్ వేదికగా చారిత్రాత్మక బిల్లుల ఆమోదానికి తుది కసరత్తు చేస్తోంది. కొంత కాలంగా చర్చలో ఉన్న జమిలితో పాటుగా మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ అమలు కోసం రాజకీయంగానూ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో నెంబర్ గేమ్ తో సిద్దం అవుతోంది. గతంలో వీగిన బిల్లు ఎలాగైనా నెగ్గించుకొనే విధంగా అడుగులు వేస్తోంది. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేదిక కానున్నాయి.
మోదీ 4.0 లక్ష్యంగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు కీలక నిర్ణయాలకు వేదిక కానున్నాయి. పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం సమాయత్తం అవుతోంది. జమిలి.. డీలిమిటేషన్ అమలు దిశగా కార్యాచరణ వేగవంతం అయింది. అమలు ముహూర్తం ఫిక్స్ చేసారు. గత సెషన్ లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్లు – డీలిమిటేషన్ బిల్లును పూర్తి స్థాయిలో అమోదం పొందే విధంగా వ్యూహాల ను సిద్దం చేసింది. జమిలి బిల్లును సైతం ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. రెండు దశల్లో జమిలి అమలుకు వీలుగా బిల్లు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందుగా కేంద్రం తాజా ఆదేశాలు ఆసక్తి కరంగా మారాయి. జమిలి ఎన్నికలతో సహా పార్లమెంట్ సంయుక్త కమిటీల(జేపీసీ) పరిశీలనలో ఉన్న అన్ని బిల్లులపై నివేదికలను జూలై 20 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే సమర్పించాలని కేంద్రం సూచన చేయటం కీలకంగా మారుతోంది.
జమిలి ఎన్నిక ల పైన బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని 39 మంది సభ్యుల కమిటీ తన నివేదికకు తుది మెరుగులు దిద్దుతోంది. తీవ్రమైన ఆరోపణలపై 30 రోజులకు పైగా జైలు శిక్షను అనుభవించిన ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, రాష్ట్ర మంత్రులను తొలగించేందుకు రూపొందించిన మూడు బిల్లులను పరిశీలించేందుకు ఏర్పర్చిన జేపీసీ నివేదిక ఈ సమావేశాల్లో నే పార్లమెంట్ కు సమర్పించనున్నారు. సంఖ్యా పరంగానూ బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా, శివసేన థాకరే వర్గం, టీఎంసీ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్డీఏకు మద్దతుగా ముందుకు వచ్చారు. దీంతో.. ఉభయ సభల్లోనూ కావాల్సిన బలం సమీకరణలో బీజేపీ చివరి ప్రయత్నాలు చేస్తోంది. అటు విపక్షాలు మాత్రం డీలిమిటేషన్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అమోదం పొందే అవకాశం లేదని ధీమాగా చెబుతున్నాయి. ఆమోదించి చూపిస్తామని బీజేపీ నేతలు అంతే ధీమాగా ముందుకొస్తున్నారు. దీంతో.. ఈ సారి సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులు.. ఆమోదం పైన రాజకీయం గా ఆసక్తి నెలకొంది.
