Friday, May 17, 2024
- Advertisement -

వర్మపై కౌంటర్ ఎటాక్..

- Advertisement -

రాంగోపాల్ వర్మ. సినిమా కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు. తాను తీయబోతున్న సినిమాలో ఏదో ఉందని.. ఏదేదో అయిపోతోందనే ప్రచారంతో హిట్ కొట్టాలనుకునే చిందరవందర దర్శకుడు. ప్రేక్షకులపై ఆయన సినిమాలతో చేసే దాడులు అన్నీఇన్నీకావు.

అందుకే ఏకంగా ఎటాక్ పేరుతో డైరక్టుగా సినిమానే తీసేసాడు. తీరా చూస్తే ఈ సినిమా ఆయనపైనే ఎటాక్ లా మారింది. ఒక్క హిట్టు చాలు అంటూ చాలా కాలంగా వర్మ చేస్తున్న ప్రయత్నాలు తాజాగా కూడా పండలేదు. భారీ తారాగణంతో తీసిన ఎటాక్ సినిమా శుక్రవారం విడుదలై వర్మ మీదే రీ ఎటాక్ గా మారింది. సినిమా చూసి బయటకు వచ్చిన వారంతా వర్మ మారడురా బుజ్జీ.. అంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. సరే, ఇంతకీ ఈ ఎటాక్ కథ ఏమిటంటే.. ఏమి లేదు.. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన గాయం సినిమాకి కాసిన్ని మార్పులు.. చేర్పులు చేసి చిన్నప్పటి కసి, పగ అనే మసాలా కలిపి తీసిన పాత చింతకాయ పచ్చడి. అందుకే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

ఇక కథ… నిజానికి కథ ఉంటేగా చెప్పుకోవడానికి. రౌడీయిజం.. రెండు గ్యాంగులు.. నరకడాలు.. పరిగెత్తడాలు.. మధ్యలో ఓ లవ్వు.. ఇదీ కథ. ప్రకాష్ రాజ్ ని చంపడంతో ప్రారంభమైన కథ ఆయన పెద్ద కుమారుడు జగపతి బాబుని మర్డర్ చేయడంతో ఊపందుకుని వాళ్లని చంపిన వాళ్లని ప్రకాష్ రాజ్ బుల్లి కుమారుడు మంచు మనోజ్ చంపడం. ఇన్ని చంపడాలు ఉన్న కథ చూడడానికి పనికి వస్తుందా…

నటీనటులు… అభినయం… కొద్ది సేపు రౌడీ… మరికొద్ది సేపు మంచోడు.. తర్వాత మృతుడు.. ఇలాంటివి చేయడంలో ప్రకాష్ రాజ్ కత్తి. అలాగే చేసాడు కూడా. ఇక జగపతి బాబు.. ఆయన కూడా సీనియర్ కాబట్టి… ఓకె. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన వడ్డె నవీన్… అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడూ అంతే… ఎన్ని సినిమాలు చేసినా మీలో మార్పు లేదు అని సూపర్ స్టార్ కృష్ణని బాపు గారు అన్నట్లు.. వడ్డె వారిది సేమ్ టు సేమ్…

ఇక సాంకేతిక నిపుణులు.. రామ్ గోపాల వర్మ సినిమాలో అన్నీ ఆయనే కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇన్ని తెలుసుకున్నాక ఈ సినిమా చూడాలా వద్దా.. అనేది మీ ఇష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -