Sunday, May 19, 2024
- Advertisement -

రూ.5 భోజ‌నం భ‌లే ఉంది

- Advertisement -

దేశ రాజ‌కీయాల‌లో చంద్ర‌బాబును మించిన వాళ్లు లేరు. ఆయ‌న ఏ ప‌థ‌కం ప్రారంభించినా.. వాటిని ప‌క్క రాష్ట్రాలు సైతం త‌మ ద‌గ్గ‌ర అమ‌లు చేస్తుంటాయి. చంద్ర‌బాబు రాష్ట్రంలో ప్రారంభించిన‌.. డ్వాక్రా మ‌హిళా సంఘాల‌ను దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పేద మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న కోసం ఆచ‌రించాయి. అలాంటి చంద్ర‌బాబు త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బాట ప‌ట్టారిప్పుడు. ఆమె విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన పేద‌ల క్యేంటీన్ల ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు ఎత్తుకున్నారు. జ‌య‌ల‌లిత గ‌త ఎన్నిక‌లకు ముందు త‌మిళ‌నాడు మొత్తం అమ్మ హోట‌ళ్ల‌ను తెరిచి.. అతి త‌క్కువ నామ‌మాత్ర రుసుంకు క‌డుపునిండా అన్నం పెట్టే ప‌థ‌కం ఆరంభించారు. అది సూప‌ర్ హిట్ అయి.. త‌మిళులు ప్రేమ‌గా అమ్మా అని పిలుచుకునే పేరుకే సార్థ‌క‌త వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆరంభించిన ఆ ప‌థ‌కం జ‌య‌ల‌లిత‌కు ఎన్నిక‌ల్లోనూ విజ‌య‌కేతనం ఎగ‌రేసేలా చేసింది. అమ్మ ప‌థ‌కాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆమ‌ధ్య అందుకుని.. హైద‌రాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో రూ.5 భోజ‌న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు వంతొచ్చింది. మ‌రో ఆరేడు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల కోసం చేయాల్సిన ఫీట్ల‌న్నీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు అన్న కేంటీన్ల‌ను జ‌య‌ల‌లిత స్ఫూర్తితో ఏపీలో ఆరంభించారు.

కేవ‌లం రూ.5తో క‌డుపునిండా భోజ‌నం అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఒకేసారి 203 అన్న కేంటిన్ల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో మొద‌టి విడ‌త‌లో 60 కేంద్రాల‌ను మొద‌టి రోజు ఆరంభించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు విజ‌య‌వాడ‌లో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. మిగ‌తావి రెండు రోజుల్లో అందుబాటులోనికి తీసుకురానున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. రోజూ ఈ 203 కేంద్రాల ద్వారా ర‌ష్ట్రంలోని రెండున్న‌ర ల‌క్ష‌ల మందికి టిఫెన్‌, భోజ‌నం అందించే ఏర్పాట్లు చేశామ‌న్నారు. అంద‌రూ క‌డుపునిండా కేవ‌లం రూ.5 చెల్లించి తినొచ్చ‌ని, క్వాలిటీ విష‌యంలో రాజీలేకుండా నాణ్యంగా అందిస్తామ‌ని చంద్ర‌బాబు వెళ్ల‌డించారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా క్యాంటిన్న‌ల‌ను నిర్వ‌హించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌సైతం చేప‌డ‌తామ‌న్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తానున్నంత‌వ‌ర‌కూ ఈ క్యాంటీన్ల‌ను కొన‌సాగిస్తామ‌ని ఆంధ్రా సీఎం తెలిపారు. అవ‌స‌ర‌మైతే దాత‌ల నుంచి విరాళాల‌ను సేక‌రిస్తామ‌న్నారు. చంద్ర‌బాబు ఈ మాట అన‌గానే ప‌క్క‌నే ఉన్న ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ రూ.25 వేల విరాళాన్ని అన్న క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌కు అంద‌జేశారు.

@ మోనూ బాగుంది..
చంద్ర‌బాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ల‌లో మెనూ కూడా నోరూరించేలా సిద్ధం చేశారు. ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం ఏదైనా రూ.5 చెల్లించి తినొచ్చు. సోమ‌వారం టిఫెన్‌గా ఇడ్లీ లేదంటే పూరీ ఏదైనా తీసుకోవ‌చ్చు. వీటితో చ‌ట్నీ, పొడి, సాంబారు, కుర్మా అందిస్తారు. మంగ‌ళ‌వారం ఇడ్లీ లేదంటే ఉప్మా, బుధ‌వారం ఇడ్లీ లేదంటూ పొంగ‌ల్‌, గురువారం ఇడ్లీ, పూరీ, గురువారం ఇడ్లీ లేదంటే ఉప్మా, శుక్ర‌వారం ఇడ్లీ లేదంటే పొంగ‌ల్ తినొచ్చు. మ‌ధ్యాహ్నం, రాత్రికి భోజ‌నంలో వైట్ రైస్‌, కూర‌, ప‌ప్పు లేదంటే సాంబారు, పెరుగు, ప‌చ్చ‌డి ఉంటాయి. వీటిని ఖ‌చ్చితంగా అమ‌లు చేసేలా.. ప్ర‌తి క్యేంటిన్ ద‌గ్గ‌ర బోర్డుల‌ను ఏర్పాటు చేశారు.

@ తెరిచి ఉంచే వేళ‌లు..
ఉద‌యం టిఫెన్ 7.30 నుంచి 10గంట‌ల వ‌ర‌కూ అందుబాటులో ఉంటుంది. మ‌ధ్యాహ్నం భోజ‌నం 12.30 నుంచి 3గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది. రాత్రి భోజ‌నం 7.30 నుంచి 9గంట‌ల వ‌ర‌కూ ఉంటుంది. ఆదివారం మాత్రం క్యేంటీన్ల‌కు సెల‌వు ఉంటుంది.

@ ఎంతెంత క్వాంటిటీలో పెడ‌తారు..
ఇడ్లీ, పూరీ మూడేసి చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగ‌ల్ 250గ్రాములు, వైట్‌రైస్ 400గ్రాములు, కూర‌లు 100గ్రాములు, ప‌చ్చ‌డి 15గ్రాములు, పెరుగు 75గ్రాములు.. ఇలాగే సాంబారు, చ‌ట్నీ లాంటివి సైతం ఇస్తారు. ఇదంతా బాగానే ఉన్నా.. వీటి నిర్వ‌హ‌ణ‌లో ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌ల‌మ‌వుతార‌నేది మ‌రికొద్ది రోజుల్లో జ‌నం నుంచి వ‌చ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తేలిపోనుంది. చంద్ర‌బాబు ఎన్నిక‌ల కోసం చేసే ఈ ఫ‌ల‌హార‌శాల‌ల ప్ర‌యోగం ఆయ‌న‌కు ఎంత‌వ‌ర‌కూ లాభం చేకూరుస్తుందో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -