పురుషుల‌కోసం పురుష క‌మిష‌న్‌ను ఏర్ప‌టు చేయాలి…న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆసక్తికరమైన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని… దీని కోసం పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త రాంధ్ర‌లో చోటు చేసుకున్న భర్తను చంపిన ఘటనలు, చంపబోయిన ఘటనలు తనను షాక్ కు గురి చేశాయని ఆమె చెప్పారు.

టీవీ ఛానెళ్లలో వచ్చే డెయిలీ సీరియళ్ల ప్రభావంతోనే మహిళల్లో క్రూరత్వం పెరుగుతోందని ఆమె అన్నారు.నిన్న రాత్రే మా కుటుంబంతో కలిసి ఓ సీరియల్ చూశా.. ఆ సీరియల్‌లో హీరోయిన్ కంటే అందంగా ఉండే ఓ అమ్మాయి విలన్. అప్పటికే ఇద్దర్ని హత్య చేసి జైల్లో ఉన్న ఆ అమ్మాయి అకస్మాత్తుగా కుండ పగులగొడుతుంది. ఆ శబ్దానికి కానిస్టేబుల్ రాగానే.. ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ముఖంపై మాత్రమే కిరోసిన్ పోసి హత్య చేసి.. ఆమె దుస్తులను తాను ధరించి పారిపోతుంది.. ఈవిధంగా ఉన్నాయి మన సీరియళ్లు.. మనుషుల్ని ఎలా చంపాలో నేర్చుకోవచ్చు’ అని ఆమె అన్నారు.

భర్తను, ప్రేమికుణ్ని, అత్తను, తండ్రిని.. ఇలా ఎవరెవరినీ ఎలా చంపాలో సీరియళ్లలో చూపిస్తున్నారు. అవన్నీ చూసి పెళ్లాలు తమ భర్తలను చంపుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. అవన్నీ చూస్తుంటే బాధేస్తోంది. అందుకే చెబుతున్నా.. పురుష కమిషన్లు పెట్టాల్సిన అవసరం ఉంది’ అని నన్నపనేని అన్నారు.

అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలను చంపడం, భర్తలను చంపడం.. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. విజయనగరంలో జరిగిన రెండు ఘటనలూ ఇలాంటివే.. ఇది మహిళలంతా సిగ్గు పడాల్సిన విషయం.. దారుణం. కచ్చితంగా పురుష కమిషన్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలి’ అని నన్నపనేని అన్నారు.

శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామని తెలిపారు. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని… వారిలో నేర ప్రవృత్తి పెరిగేందుకు సీరియల్స్ దోహదం చేస్తున్నాయని అన్నారు. మహిళల్లో నేరపూరితమైన ఆలోచనలు రావడం సమాజానికి మంచిది కాదని అన్నారు.