Sunday, June 16, 2024
- Advertisement -

ఈసారి ఎన్నిక‌ల వ్యూహం.. చాలా కొత్త‌గా ఉంది

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి మూడు ప్ర‌ధాన పార్టీల ఎన్నిక‌ల వ్యూహం చాలా కొత్త‌గా ఉంది. గ‌తంలో ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచి గెలిచారు, మ‌ద్యం ఏరులై పారించార‌నే మ‌డిక‌ట్టు ప‌దాల‌ను ఎక్కువుగా రాజ‌కీయ నాయ‌కులు వాడేవారు. కానీ.. ఇప్పుడు కొత్త ట్రెండ్ వ‌చ్చింది. ఎదుటి పార్టీల వారు డ‌బ్బులు పంచేందుకు సిద్ధం చేసుకున్నార‌ని.. ఇస్తే తీసుకోమంటూ స్వ‌యంగా ప్ర‌ధాన పార్టీల అధినేత‌లే సూచిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు సూటుకేసుల‌తో దిగేందుకు కొంద‌రు సిద్ధ‌మ‌వుతున్నారు. వారి మాట‌లు విని మోస‌పోవ‌ద్దు. అవినీతి సంపాద‌న‌ను పంచి మ‌ళ్లీ గ‌ద్దెనెక్కాల‌ని చూస్తున్నారు.. అంటూ గ‌త ఏడాదిగా చంద్ర‌బాబు చాలా వేదిక‌ల‌పై చెబుతూ వ‌స్తున్నారు. వైకాపా అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఒక‌డుగు ముందుకేసి త‌న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా రెండు రోజుల కోసారి నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌ల్లో త‌ర‌చూ చెప్పే మాట ఇదీ.. చంద్ర‌బాబునాయుడు మ‌ళ్లీ మాయ‌మాట‌లు చెప్పేందుకు వ‌స్తున్నాడు.

ఇంటింటికీ రూ.5 వేల రూపాయ‌ల‌ను పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆ డ‌బ్బులు మ‌న‌వే ప‌ర్వాలేదు తీసుకోండి. కానీ.. ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించి వేయండి. నాకు అవ‌కాశం క‌ల్పించండి.. అంటూ స‌రికొత్త‌గా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్రతి బ‌హిరంగ స‌భ‌లోనూ ఈ వాక్యాలు చెప్ప‌కుండా వెళ్ల‌డం లేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇదే మాట చెబుతున్నారు. ఎదుటి పార్టీల మాదిరిగా నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌బ్బా. వాళ్లు ఇచ్చే డ‌బ్బుల‌నే మొహ‌మాటం లేకుండా తీసుకోండి. మీకే ఓటు వేస్తామ‌ని న‌మ్మించండి.. కానీ.. ఓటు మాత్రం మ‌న జ‌న‌సేన‌కు వేసేయండి.. అంటూ త‌న స్టైల్‌లో అభిమానుల‌కు వేదిక‌ల‌పై నుంచి మార్గ‌నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో కీల‌కంగా నిలిచే ఈ మూడు పార్టీల అధినేత‌లూ ఎత్తుకున్న ఈ స‌రికొత్త వ్యూహం వెనుక‌.. కొంత మంది మాస్ట‌ర్ మైండ్‌లు ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ప్ర‌తి పార్టీ ఓ ప్ర‌త్యేక అడ్వైజ‌రీ బృందాల‌ను నియ‌మించుకున్నాయి. వీరు ఓట‌ర్ల నాడిని ప‌ట్టేందుకు అనేక స‌ర్వేలు చేపట్టిన త‌ర్వాత‌.. తాము ప‌నిచేస్తున్న పార్టీ ఎలా ముందుకెళ్లాల‌నేది దిశానిర్దేశం చేస్తాయి.

రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి తెలుగుదేశం పార్టీ పాతిక కోట్ల చొప్పున ఖ‌ర్చు పెట్టేందుకు సిద్ధం చేసుకుందంటూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్న‌న్ని డ‌బ్బులు నా ద‌గ్గ‌ర లేవంటూ.. తాజాగా శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ సెటైర్లు వేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో డ‌బ్బు వ‌ర‌ద‌లా పార‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ఇప్ప‌టినుంచే స‌న్న‌ద్ధ‌మ‌వ్వ‌డంలో భాగంగా అన్ని పార్టీలు ఈసారి ఈ కొత్త‌వాదం ఎత్తుకున్నాయి. ఎవ‌రు ఎంత డ‌బ్బులు ఇచ్చినా ఓట‌ర్ల మ‌నుసు మార‌కుండా ముందుగానే త‌మ‌కు అనుకూలంగా మార్చేసుకుంటే.. అప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బుల‌ను చూసి మ‌న‌సు మార్చుకోర‌నేది ఈ కొత్త‌ వ్యూహం వెనుక ఉన్న అస‌లు అంత‌రార్థం.

ఒక‌వేళ ఎదుటి పార్టీ వాళ్లొచ్చి.. ఇంటింటికీ రూ.5 వేలు ఇచ్చినా.. తీసుకోండి. కానీ.. ఓటు వెయ్యొద్దంటూ చెప్ప‌డం వ‌ల్ల డ‌బ్బులు వ‌స్తాయ‌ని, తీసుకోవాల‌ని, కానీ.. ఓటు వేయ‌కూడ‌ద‌నే స‌న్న‌ద్ధ‌త‌తో ఓట‌ర్లు ముంద‌స్తుగానే ఉండాల‌నేదే.. ఈ మూడు పార్టీల అధినేతల‌ న‌యా వ్యూహం. సాధార‌ణంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఎన్నిక‌ల‌ను డ‌బ్బులు శాసిస్తుంటాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే.. ఒక పార్టీ నుంచి డ‌బ్బులు తీసుకుంటే.. మాట‌కు కట్టుబ‌డి వారికే ఓటు వేసే నైజం ఎక్కువ మంది ఓట‌ర్ల‌లో ఉంటుంది. ఈసారి ఈ నైజాన్ని పోగొట్టాల‌నేదే ఈ కొత్త పోక‌డ వెనుక ఉన్న అస‌లు ర‌హస్యం. డ‌బ్బులు ఇస్తే తీసుకోవ‌చ్చు త‌ప్పేం లేదు.. కానీ ఓటు ఎవ‌రికి వెయ్యాలో అది త‌నిష్ట‌మ‌నేలా జ‌నాన్ని స‌న్న‌ద్ధం చేయ‌డ‌మే దీని ల‌క్ష్యం. అది మ‌న డ‌బ్బే ఏం ప‌ర్వాలేదు తీసుకోండి.. అంటూ చెప్ప‌డం వెనుక ఉన్న మాస్ట‌ర్ ప్లాన్ కూడా ఇదే. దీనివ‌ల్ల త‌మ ప్ర‌సంగాలు విని ఆక‌ర్షితుల‌య్యే ఓటు బ్యాంకు.. స్థిరంగా ఎటూ వెళ్ల‌కుండా ఉంటుంద‌నేది.. వీరి ఎత్తుగ‌డ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -