Friday, May 17, 2024
- Advertisement -

ఐటీ దాడులపై 4 రోజుల ముందే హెచ్చరించిన చంద్రబాబు

- Advertisement -

గురువారం నుంచి ఏపీలో ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 28చోట్ల తనిఖీలు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాతో పాటు హైదరాబాద్‌లో కూడా ఐటీ శాఖ పంజా విసిరింది. వీఎస్ లాజిస్టిక్స్, స్వగృహ, సదరన్ కన్‌స్ట్రక్షన్స్‌తో సహా ఏపీలో మంత్రి నారాయణ కాలేజ్ లు, ఇళ్లు, ఆఫీసులు, పలు కంపెనీల్లో ఈ దాడులు జరిగాయి. ఆయా సంస్థల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సంబంధించిన యాజమాన్యాల పెద్దలను ఐటీ ప్రశ్నించింది. జగ్గయ్యపేటలోని ప్రీకాస్ట్ ఇటుకల పరిశ్రమపై ఐటీ దాడులు చేసింది. కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీద మస్తాన్ రావు వ్యాపార సంస్థలపై కొరడా ఝుళిపించారు. టంగుటూరు మండలం చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ గ్రానైట్స్‌ కంపెనీలో సోదాలు చేశారు. జరుగుమిల్లి మండలం కె.బిట్రగుంటలో సదరన్‌ ట్రోపికల్‌ ఫుడ్స్‌ ఆఫీసులో ఐటీ తనిఖీలు చేపట్టారు. ఒంగోలు ఎమ్మెల్యే రామారావు కంపెనీలు, పరిశ్రమల్లోనూ సోదాలు చేశారు.

అయితే ఏపీలోని మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతాయని 4 రోజుల క్రితమే చంద్రబాబు పార్టీ నేతలకు హెచ్చరించారు. తనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవి పక్కాగా జరుగుతాయని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు చెప్పినట్లే, ముందే హెచ్చరించినట్లే, టీడీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు, కంపెనీల్లో ఐటీ దాడులు జరగడంతో టీడీపీ నేతలు బీజేపీపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్వహించిన అత్యవసర సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఐటీ దాడుల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం టీడీపీపై బీజేపీ నేతల కక్షసాధింపు చర్యలేనని చంద్రబాబు ఆరోపించారు. భయపడాల్సిన పని లేదన్నారు. మోడీని ఎదిరించినందుకే ఇలా టీడీపీ నేతలను మాత్రమే టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని, బీజేపీని ఎవరైనా విమర్శిస్తే చాలు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం మోడీకి ఆనవాయితీగా మారిపోయిందన్నారు.

ఐటీ దాడుల గురించి తాను ముందే హెచ్చరించాను కదా, ఇవన్నీ టీడీపీ పై రాజకీయకక్షలో భాగమేనని చెప్పారు. హోదా ఇవ్వమని నిలదీస్తున్నందుకే, రాజకీయ కక్షతోనే బీజేపీ, ఏపీలోని టీడీపీ నేతలను టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయిస్తున్నారని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఇలాంటి సిగ్గుమాలిన పనులు మానుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్యప్రసాద్ సూచించారు. టీడీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు ఆపరేషన్ గరుడలో భాగమేనని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -