Friday, May 17, 2024
- Advertisement -

మరి నమో అంటే నమ్మించి మోసం కాదా ?

- Advertisement -

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని సామెత. ఈ సామెత కొద్ది నెలల క్రితమే బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన జీవీఎల్ నరసింహారావుకి నూటికి నూరు శాతం సరిపోతుంది. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సారుకి….సొంత రాష్ట్రం ఏపీ హక్కుల కంటే, పదవిచ్చిన పార్టీ మీదే ప్రేమ ఎక్కువ. కేవలం పాతిక సీట్ల కోసం టీడీపీ ఎన్నో అబద్ధాలు ఆడుతోంది. డ్రామాలాడుతోంది. ఆ పార్టీ అబద్ధాల పుట్ట. అవినీతి పాపాల చిట్టా నా దగ్గరుంది. పార్లమెంట్ లో దాన్ని బయటపెట్టేస్తా…అని బెదిరించేశారు. టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చేసి, విర్రవీగుతున్నారు. 3 నెలల నుంచి వీరి అబద్ధాలు, నాటకాలు, దొంగ దీక్షలు ప్రజలు చూస్తున్నారు. నేనూ చస్తున్నాను. టీడీపీకి విశ్వసనీయత లేదు. అవినీతి, అక్రమాలు, అరచాకాలే ఆ పార్టీకి కావాల్సింది. మెజార్టీ ఇచ్చేశారు కనుక టీడీపీని ప్రజలు భరిస్తున్నారు. లేదంటే ఐదేళ్లు కాదు, ఐదు రోజులకే ఇంటికి పంపేసేవారు. ఇది రాజకీయం కాబట్టి సరిపోయింది. సినిమా అయి ఉంటే 5 రోజులకే జనం తిప్పి కొట్టేవారు. ఇలా జీవీఎల్ నరసింహారావు సారు రెచ్చిపోయారు. ఢిల్లీ వేదికగా మైకు పట్టుకుని ఏకధాటిగా టీడీపీని తిట్టి పోసేశారు.

బీజేపీ ఎంపీగా ఈయన ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు ? ఇలాగే మాట్లాడతారు. కానీ ఆయన మాటలను ఒక్కసారి క్షణ్ణంగా పరిశీలిస్తే…అవే విసుర్లు, విమర్శలు, ప్రశ్నలు, వ్యంగ్యాస్త్రాలు తమ బీజేపీకి కూడా వర్తిస్తాయి కదా ! అన్నది అర్ధమవుతోంది. టీడీపీ మోసం చేసింది సరే. టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ సరే.. అది కూడా ఒప్పుకుందాం. మరి ఏపీని బీజేపీ మోసం చేయలేదా ? 2014 ఎన్నికల ముందు నమో అంటే నరేంద్రమోడి. ఆయన ప్రధాని అయ్యాక నమో అంటే నమ్మించి మోసం. ఏపీకి న్యాయం చేసేస్తాం. హోదా ఇచ్చేస్తాం. పోలవరం పూర్తి చేసేస్తాం. అని తిరుమలేశుని సాక్షిగా ఇచ్చిన హామీ, చేసిన మోసం జీవీఎల్ సార్ కి గుర్తు లేదా ? 3 నెలలుగా టీడీపీ అబద్ధాలు, నాటకాలు, దొంగ దీక్షలను మీరు చూస్తున్నారా ? అంటే 3 నెలల క్రితమే మీకు బీజేపీ ఎంపీ పదవి కట్టబెట్టింది. అందుకే ఆ కృతజ్ఞతతోనేనా… 3 నెలల నుంచే తమరు వీటన్నింటినీ చూస్తున్నారా ? అంతకముందు తమరు వీటన్నింటినీ చూడలేదా ? పాతిక సీట్ల కోసం అబద్దాలా ? అని నిలదీశారు.

ఒక్కసారి ఎంపీ పదవి ఇచ్చినందుకే మీరు ఇలా, అయినదానికీ కానిదానికీ, టీడీపీని టార్గెట్ చేస్తూ, ఏపీకి తీరని ద్రోహం చేసిన బీజేపీని భుజాన మోస్తున్నారే ? మరి పాతిక సీట్ల కోసం టీడీపీ ప్రయత్నిస్తే మీకు చాలా తేలిగ్గా కనిపిస్తోందా ? సరే పాతిక సీట్ల కోసం ఎందుకు ? మీ దృష్టిలో పాతిక సీట్లు చాలా తక్కువే. మీకు దమ్ముంటే ఏపీలో ఒక్క ఎంపీ సీటు గెల్చుకోండి చూద్దాం. ఎంపీ సీటు గెల్చుకోవడం అంటే..చొక్కాకు చెమట పట్టకుండా రాజ్యసభ ద్వారా ఎన్నికవడం కాదు. ఓ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు పోటీ చేసి గెలవండి. ఆ తర్వాత పాతిక ఎంపీ సీట్ల కోసం ఇంత రాజకీయమా ? అని మాట్లాడండి. ఇంకోమాటన్నారు సార్ మీరు. టీడీపీకి విశ్వసనీయత లేదు. అవును లేదు. మరి బీజేపీకి ఉందా ? నమ్మించి మోసం చేసిన మోడీకి ఉందా ? హోదా ఇస్తామని చెప్పి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి, ఏపీ ముఖాన కొట్టిన మోడీకి ఉందా విశ్వసనీయత ? ఐదేళ్లు అవకాశమిచ్చేశారు, మెజార్టీ ఉంది కాబట్టి టీడీపీని జనం భరిస్తున్నారు. లేదంటే 5 రోజులకే ఇంటికి పంపేసే వారన్నారు. ఈ మాట బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా జీవీఎల్ గారూ… మీ మోడీ ఏపీ గొంతుకోస్తున్నా, మోసం చేస్తున్నా, నిండా ముంచేసినా, పూర్తి మెజార్టీ ఇచ్చేశాం. అందలం ఎక్కించేశాం. కనుకే ఆరుకోట్ల ఆంధ్రులం భరిస్తున్నాం. లేదంటే ప్రత్యేకహోదా ఇవ్వనందుకు మొదటి ఏడాదే ఆయనను ఇంటికి పంపేసేవాళ్లం.

జీవీఎల్ గారూ.. మీకు పదవి ఇచ్చినందుకు ఎంజాయ్ చేయండి. కానీ అదే సమయంలో మీ సొంత రాష్ట్రం ఏపీ గురించి కొంతలో కొంతైనా ఆలోచించండి. మా రాష్ట్రం గొంతు తడిగుడ్డతో కోస్తారా ? అని మీ పార్టీ పెద్దలను అడిగే దమ్మూ ధైర్యం తెగువ మీలో ఎటూ ఉండవు. కానీ ఎవరైనా అలా ప్రశ్నిస్తే, వీలైతే మద్దతివ్వండి. లేదంటే కామ్ గా, 3 నెలల క్రితం వరకూ, అదే మీకు పదవి ఇవ్వకముందు ఎలా చూడకుండా ఉన్నారో ..అలాగే ఉండిపోండి. అంతే కానీ మీ పార్టీ, మీ మోడీ, పెద్ద తోపుల్లాగా ? నిలువెత్తు నిజాయతీ పరుల్లాగా బిల్డప్ ఇవ్వకండి. ఒక వేలు మీరు అవతలివారి వైపు చూపేముందు నాలుగు వేళ్లు మీవైపు చూపుతాయనే విషయాన్ని మర్చిపోకండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -