తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రోజురోజుకూ శృతి మించుతోంది. గతంలో ఏ ఉపఎన్నికకు లేని విధంగా మూడు ప్రధాన పార్టీల త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండడంతో వాద ప్రతివాదాలు, పరస్పర విమర్శలతో పోలిటికల్ హిట్ తారస్థాయికి చేరింది. ఇక ఎలక్షన్ దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఒకవైపు ఓటర్లను ఆకర్శించేందుకు వారాల జల్లు కురిపిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనేందుకు వినూత్నరీతిలో ప్రచారాలు చేస్తున్నాయి. ఆ మద్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ పే అంటూ గోడలపై పోస్టర్లు వెలసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కు సమాధి కట్టినట్లుగా ప్రచారం చేస్తూ ఉండడంతో కమలనాథులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఇలాంటి ప్రచారాలు చేస్తోందని మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ బీజేపీ నేత మనోహర రెడ్డి అన్నారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ” ఫామ్ హౌస్ కుటుంబీకుల ప్రోత్సాహంతో టిఆర్‌ఎస్ పోకిరిలు కొత్త స్థాయికి దిగజారిపోయారని, మునుగోడు ప్రజలు ఈ దుష్ట ప్రవర్తనను సహించారని ” కిషన్ రెడ్డి ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే ఇలా సమాధి కట్టిన వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామంలోని నడిరోడ్డుపై ఈ సమాధి కనిపించింది. అయితే 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా నడ్డా ఉన్నప్పుడూ ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతోనే కొందరు ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి జేపీ నడ్డా కు సమాధి కట్టడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఇవి కూడా చదవండి