Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు అనుభవానికి అసలు పరీక్ష

- Advertisement -

ఇటీవలే 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అనుభవానికి, చాణక్యనీతికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అసలు సిసలు పరీక్ష పెట్టనున్నాయి. ఈ ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కి ఎంత ముఖ్యమో చంద్రబాబుకి అంతే ముఖ్యం. ఇక్కడ బాబు తీసుకునే స్టాండ్, వేసే ఎత్తులు, కదిపే పావులు ఆయన రాజకీయ జీవితాన్ని పదింతలు పైకి తీసుకెళ్లవచ్చు. లేదా రాజకీయజీవితానికి చరమగీతం కూడా పాడవచ్చు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాయుడు, 2019లో మళ్లీ మోడిని ప్రధానికి చూడటానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. మిత్రధర్మాన్ని కూడా పాటించకుండా, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని మోడీపై బాబు నిప్పులు చెరుగుతున్నారు.

దక్షిణాదిలో బీజేపీ నేతల ఆటలు సాగనివ్వకూడదని, తద్వారా దేశ రాజకీయాల్లో పెనుమార్పు తేవాలని యోచిస్తున్నారు. సుదీర్ఘ శతృవు కాంగ్రెస్ సహ అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతూ మోడీకి వ్యతిరేకంగా మహాకూటమిని కట్టే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారు. ఆ దిశగా చేసిన ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం, మొన్న కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని పట్టుమని పది రోజులు కాకముందే కూల్చడం. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడం. ఈ ఎపిసోడ్ తో ప్రత్యక్షంగా చంద్రబాబుకి, టీడీపీకి సంబంధం లేకపోయినా, తెరవెనుక చంద్రబాబు మంత్రాంగం బాగా పని చేసిందన్నది తెలిసిందే. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి సలహాలు, అడగడం, మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కోరడంతో నిత్యం టచ్ లో ఉన్న చంద్రబాబు జాతీయ స్థాయిలో మీడియాలో కర్నాటక ఎపిసోడ్ ను హైలెట్ చేయించారు. దేశమంతా కర్నాటక ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేలా పావులు కదిపారు. బీజేపీ తీరును మీడియా ద్వారా ఎండగట్టించి, యడ్యూరప్ప సర్కార్ కుప్పకూలిపోయేలా చేసి కాంగ్రెస్, జేడీఎస్ విజయం సాధించేలా చేశారు.

కర్నాటకలో హైడ్రామా వెనుక ఎవరున్నారో మోడీకి తెలియంది కాదు. కాకపోతే అప్పటికే గోవా, మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లో తాము చేసిన పనే కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ చేయడంతో, వాటికి వెనకనుండి చంద్రబాబు నడిపించిన హైడ్రామాను కూడా గ్రహించారు. కానీ నాడు దేశమంతా వ్యతిరేకత రావడంతో ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ అలా సైలెంటుగా ఉండే పరిస్థితి కానరావట్లేదు. తన రహస్య మిత్రుడు కేసీఆర్ కు పూర్తి అండదండలు అందిస్తూ మోడీ నడిపిస్తున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తాను…అని చెప్పి కాంగ్రెస్ ను మోసం చేశారు కేసీఆర్. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కు పట్టపగలే చుక్కలు చూపించడం ఖాయం. దీంతో ఎలాగైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాకూడదని కేసీఆర్ వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తమను అన్నివిధాలా తొక్కేస్తున్న మోడీ మళ్లీ ప్రధాని కాకూడదని చంద్రబాబు శతకోటి దేవుళ్లకు దండం పెడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతే, ఆ పార్టీకి మద్దతిస్తున్న బీజేపీ, మోడీకి గట్టి దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, త్వరలో జరగబోయే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం గట్టిగా పడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా లోపాయికారి మద్దతు ప్రకటించైనా సరే, టీఆర్ఎస్ ను ఓడించాలనే యోచనలో కూడా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు ప్రధానలక్ష్యం టీఆర్ఎస్ ఓటమి కాదు. కాంగ్రెస్ గెలుపు. ఇప్పటికే కర్నాటకలో బీజేపీకి చెక్ పెట్టారు కనుక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే, ఆ ఊపు కచ్చితంగా 4 రాష్ట్రాల మీద పడుతుంది. అదే ఊపులో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. ఆ పార్టీ శ్రేణుల్లో దేశమంతటా ఉత్సాహం వస్తుంది. అంతిమంగా సార్వత్రిక ఎన్నికల్లో యీపీఏ కూటమి గెలిస్తే, మోడీ మీద చంద్రబాబు గెలిచినట్టే, అందుకే ఆయన కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధ పడుతున్నారు. కేసీఆర్ మీద కోపం ఉన్నా లేకున్నా, ఆయనతో శతృత్వం అవసరం లేకున్నా, జాతీయ స్థాయిలో అవసరాలు, ప్రయోజనాల నేపథ్యంలో కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వర్సెస్ చంద్రశేఖర్ రావు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో !?

మొత్తానికి రెండు ప్రాంతీయ పార్టీల రాజకీయ ఎత్తుగడలు, రెండు జాతీయ పార్టీల జాతకాలను మార్చే స్థితిలో ఉన్నాయి. అందుకే ఈ దశలో చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో కీలకమైనది. ఆయన వేసే ప్రతి అడుగు ఆయన రాజకీయ భవిష్యత్ కు, ఎంతో కీలకమైనది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయి, ఆ ప్రభావం 4 రాష్ట్రాలపై పడి, అక్కడా ఓటమి పాలైతే, మళ్లీ మోడీ పీఎం అయితే, ఇక్కడ కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలను గుర్తు పెట్టుకుని మరీ కేసీఆర్ ద్వారా మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఖాయం. అందుకే చంద్రబాబు అనుభవానికి తెలంగాణ ఎన్నికలు అసలు సిసలు పరీక్ష. మరి ఆయన పాసవుతారో ? ఫెయిలవుతారో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -