Sunday, May 19, 2024
- Advertisement -

కాంగ్రెస్ టీడీపీ పొత్తు పొడిస్తే తప్పేంటి ?

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు దాదాపు ఖరారైయినట్టే. కాకపోతే పొత్తు ఖరారైపోయినట్లు ఇప్పటి నుంచే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తొందరపాటే అవుతుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తాము రెడీ అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా స్పష్టం చేశారు. కానీ చర్చల పేరుతో ఇక ఆ విషయాన్ని సాగదీసి, రోజూ మీడియాలో నాన్చుతూ, సరైన సమయం చూసి పొత్తు గురించి అధికారికంగా ప్రకటిస్తారు. మరో వైపు ఇప్పటికే ఏఐసీసీ తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ నేతలకు ఈ పొత్తుల విషయంపై పార్టీ శ్రేణులతో చర్చించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆ ముగ్గురిలో సుదీర్ఘకాలం టీడీపీలో పని చేసి, ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజుకు బాధ్యత ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు గాంధీ భవన్ వేదికగా జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలు, ఇతర కీలక నాయకులు తమ పార్టీ శ్రేణులతో పొత్తుల గురించి చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా లాభమా ? నష్టమా ? ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ? ఏ నియోజకవర్గాన్ని టీడీపీకి త్యాగం చేయాలి ? ఏ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో నిలవాలి ? వంటి కీలక చర్చలు జోరుగుగా జరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ పొత్తు అపవిత్రమైనదిగా చాలామంది ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. అదేదో జరగరాని పని అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారో…నేడు అదే కాంగ్రెస్ తో పొత్తు ఏంటని ? ఇది ఎన్టీఆర్ ఆత్మకు క్షోభ కలిగిస్తుందని మండిపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని అంటున్నారు.

అయితే కాంగ్రెస్ తొ పొత్తుపై అంత రాద్ధాంతం ఎందుకో అర్ధం కావడం లేదు. ఆ పార్టీ ఏం పాకిస్తాన్ కు చెందిన పార్టీ కాదు. ఇతర దేశాల్లో స్థాపించిన పార్టీ కాదు. ఈ దేశ చరిత్రలో, దేశాభివృద్ధిలో అనేక మైలు రాళ్లు అందుకున్న పార్టీ. మహామహులు నడిపించిన పార్టీ. దేశానికి దిశానిర్దేశం చేసిన పార్టీ. అటువంటి పార్టీలో అప్పటి పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారే తప్ప, ఆ పార్టీలోని వ్యక్తులను వ్యతిరేకించి కాదు. అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎప్పటికప్పుడు పరిస్థితులు, అవసరాలు, ప్రజాప్రయోజనాలను ఉద్దేశించి అభిప్రాయాలను మార్చుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే వాటి మనుగడ సాధ్యం. అంతే తప్ప ఓ రాయిలా రప్పలా, పాత సిద్ధాంతాలు, పురాతన అభిప్రాయాలను పట్టుకుని వేలాడితే పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది. ఎంత ఘనచరిత్ర ఉన్న పార్టీ అయినా సరే కాలగర్భంలో కలిసిపోతుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త మిత్రులను వెతుక్కోవాల్సిందే.

ఇప్పుడు తరాలు మారాయి. రాజకీయమూ మారింది. యువతరం కోరుకుంటున్న బలమైన మార్పు కావాలంటే రాజకీయ పార్టీల్లోనూ మార్పు రావాల్సిందే. లేదంటే కాలం చెల్లిపోవడం ఖాయం. అందుకే కాంగ్రెస్ టీడీపీయే కాదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా వ్యూహాలు మార్చాల్సిందే. మా పార్టీ అంత ఇంత అని చరిత్ర చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తామంటే ఎల్లకాలం కుదరదు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ఈ మధ్య స్పష్టమైన మార్పు వచ్చింది. నియంతృత్వపోకఢులకు ఆ పార్టీ గుడ్ బై చెప్పింది. అందుకు ఉదాహరణ గా ఎన్నో అంశాలను చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడం. ప్రాంతీయ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా, తమ పార్టీకి అధిక స్థానాలు ప్రజలు కట్టబెట్టినా బీజేపీ వంటి బలమైన పార్టీని, నరేంద్రమోడీ నిరంకుశ నాయకత్వాన్ని ప్రశ్నించడానికి కాంగ్రెస్ తక్కువ స్థానాలు వచ్చిన జేడీఎస్ కు అవకాశమిచ్చింది. కుమారస్వామిని అధికారంలో కూర్చోబెట్టింది.

మరోవైపు ఏపీకి జరిగిన నష్టంపై స్పష్టతనిచ్చింది. ప్రత్యేకహోదాపై ఇంతవరకూ నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఆయనే కాదు ఆ పార్టీ అగ్రనేతలు కూడా ప్రత్యేకహోదాపై పెదవి విప్పడం లేదు. రాష్ట్ర భవిష్యత్ కు తూట్లు పొడుస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పటికే ఏపీకి ప్రత్యేకహోదాపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. యూపీఏ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేకహోదా ఇస్తామని, దానిపైనే తొలి సంతకం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ సహా ఆ పార్టీ సీనియర్ నేతలంతా స్పష్టం చేశారు. ఓ జాతీయ పార్టీగా ఏదైనా అంశంపై జనం ఆశించేది అలాంటి స్పష్టమైన వైఖరే. అంతేకానీ నరేంద్రమోడీలా ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి, అధికారం చేపట్టాక ఆ ఊసే ఎత్తకుండా తడిగుడ్డతో గొంతుకోసే బీజేపీ వంటి దొంగ వైఖరి కాదు. అందుకే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ముమ్మాటికీ జనానికి అంగీకారమే. అది ప్రజాప్రయోజనాలకు లాభదాయకం కూడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -