Saturday, May 18, 2024
- Advertisement -

ప.గోలో పాదయాత్ర…… 2019 విజయాన్ని డిసైడ్ చేసిందా?

- Advertisement -

2014ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణం అయిన ప్రధాన జిల్లా పశ్ఛిమగోదావరినే. ఈ జిల్లాలో మొత్తం సీట్లన్నీ తెలుగుదేశానికే దక్కాయి. వైకాపా ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం బలాబలాలు ఏంటి? వైకాపా అధినేత ప్రజాసంకల్పయాత్ర పశ్ఛిమ ప్రజలను ఏ మేరకు కదిలించింది? ఇప్పుడు ఈ విషయాలే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 2014లో పశ్ఛిమ నుంచి 15 సీట్లు గెల్చుకున్న చంద్రబాబు ఈ సారి కూడా అదే స్థాయిలో సీట్లు సాధించగలడా? సాధించలేకపోతే మాత్రం తెలుగుదేశం ఓటమి ఖాయం. ఎందుకంటే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో వైకాపా బలంగా ఉన్న ఏ ఒక్క నియోజకవర్గంలోనూ తెదేపా కొత్తగా బలపడింది ఏమీ లేదు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదని స్వయంగా చంద్రబాబు సొంత సర్వేలోనే తేలింది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2014లో గెలుచుకున్న ఏ కొన్ని సీట్లలో దెబ్బతిన్నా తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ పశ్ఛిమలో మరోసారి అదే స్థాయి ఫలితాన్ని సాధించాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అయితే ప్రజా సంకల్ప యాత్రకు ముందే…….టిడిపిని పవన్ వీడినప్పుడే పశ్ఛిమలో తెలుగుదేశం బలహీనపడిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు వచ్చిన ఉపఎన్నికల్లో పశ్ఛిమ గోదావరి జిల్లాలో టిడిపికి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అదీ తెదేపా వాస్తవ పరిస్థితి. అయితే రాజులు బలంగా సపోర్ట్ చేసే బిజెపి మద్దతు, కాపులు సపోర్ట్ చేసే పవన్ మద్దతుతో సీట్లు గెలుచుకోగలిగాడు చంద్రబాబు.

అయితే ఈ సారి మాత్రం ఆ రెండు వర్గాలు కూడా టిడిపికి దూరమయ్యాయి. ఇక ఇప్పుడు జగన్ పాదయాత్రకు పశ్ఛిమలో విశేష స్పందన కనిపించింది. కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల స్థాయిలో పశ్ఛిమలో కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అన్నింటికీ మించి స్థానిక నాయకులు, ప్రజల్లో పట్టున్నవారు, మాజీ నాయకులు చాలా ఎక్కువగా వైకాపాలో చేరిన జిల్లా పశ్ఛిమ గోదావరి జిల్లానే. ఇక జగన్‌ కూడా రాష్ట్ర వ్యాప్త సమస్యలతో పాటు, స్థానిక సమస్యలను ఎంత టైంలో పరిష్కరిస్తాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ సాగించిన ప్రసంగాలు ప్రజలు బాగానే ఆకట్టుకున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ సారి పశ్ఛిమ గోదావరి జిల్లాలో వైకాపాకు మెజారిటీ సీట్లు ఖాయమని, ఆ మేరకు టిడిపి సీట్లను నష్టపోతుందని సర్వేలు తేల్చిచెప్తున్నాయి.

2019గెలుపోటములను ఇదే డిసైడ్ చేస్తుందని సర్వేలు చెప్తున్నాయి. పశ్ఛిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతున్న సందర్భంగా వచ్చిన సర్వేలన్నీ కూడా వైకాపా గెలుపును స్పష్టంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. మరోవైపు పశ్ఛిమలో జగన్ పాదయాత్ర ప్రభావాన్ని అంచనా వేసిన చంద్రబాబు……స్థానిక ప్రజలకు, మత్స్యకారులకు గట్టి వరాలే ఇచ్చాడు. అయితే అవన్నీ కూడా జగన్‌ని ఎక్కడ బలపరుస్తారో అన్న భయంతో ఇచ్చినవేనన్న నమ్మకం ప్రజల్లో బలపడడంతో తెలుగుదేశం పార్టీకి ఫలితం లేకుండా పోయిందని టిడిపి నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఈ సారి అయినా చంద్రబాబు జగన్‌ని ఫాలో అవడం మానేసి జగన్ పాదయాత్రకు ముందే ఆయా జిల్లాల ప్రజలకు చంద్రబాబు వరాలు ప్రకటిస్తే కాస్త ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న భావన టిడిపిలో వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -