Thursday, May 16, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డి షార్ప్ అయ్యేదెప్పుడో ?

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు నాలుగేళ్లుగా ఉన్నా ఇంకా పోలటిక్స్ లో అప్ డేట్ కాలేకపోతున్నారు. పాడిందే పాడుతూ, పసలేని వ్యాఖ్యలతో ఆయన టైం వేస్టు చేసుకుంటున్నారు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సిన కీలక సమయాల్లోనూ, ఎత్తుకుపై ఎత్తు వేయాల్సిన టైంలోనూ అరిగిపోయిన టేప్ రికార్డర్ లా ఎంతసేపూ పార్టీ ఫిరాయించిన ఎంపీల మీద వేటు వేయండి. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి…అంటూ పదే పదే ఆ పాటే పాడుతున్నారు. తాజాగా కూడా తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, టీఆర్ఎస్ లో చేరిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వినతిపత్రం సమర్పించారు. ఇదే తొలిసారి కాదు, ఇప్పటికే పలుసార్లు ఆ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, మీడియాలోనూ పదే పదే చర్చించారు. మా పార్టీ టికెట్ పై నెగ్గారు. మరో పార్టీలోకి మారిపోయారు. వారిపై తక్షణం అనర్హత వేటు వేయండి.. అని దాదాపు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ విజయసాయి రెడ్డి చెప్పే మాటలు ఇవే. ఈ సబ్జెక్ట్ లేకుండా ఆయన మీడియా సమావేశాన్ని ముగించరు.

విజయసాయిరెడ్డి కోరినట్లు అనర్హత వేటు వేయాలంటే ఈ నలుగురే కాదు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అది ఒక్క తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీకి చెందిన అంశం కాదు. దాదాపు దేశంలోని అన్ని పార్టీలకు చెందిన అంశం. అందుకే అన్ని పార్టీలు దీనిపై చూసీ చూడనట్లుగానే ఉంటున్నాయి. సో ఫిరాయింపు అనేది చాలా తేలికైన విషయం అయిపోయింది. ఆ అంశంపై పదే పదే మాట్లాడి ప్రయోజనం లేదు. టెక్నికల్ గా వారిపై అనర్హత వేటు పడకపోయినా, నైతికంగా వేటు పడినట్లే, ఓ పార్టీ జెండా, అజెండా పట్టుకుని, ఆ పార్టీ గుర్తుపై నాయకుడి బొమ్మ చూపించుకుని ఎన్నికల్లో గెలిచి, వెంటనే ఇతర పార్టీలోకి మారిపోవడం అంటే…అంతకుమించిన అనైతికత వేరే ఉండదు. వీరికి ఓట్లు వేసిన ప్రజలే ఆయా నియోజకవర్గాల్లో వీరి సంగతి చూసుకుంటారు.

విజయసాయిరెడ్డి ఇప్పటికైనా ఈ టాపిక్ వదిలేసి పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే ఆయనకే మంచిది. కాపుల రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంతోకొంత నష్టం చేశాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపు రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు పెట్టి, కాపుల పక్షపాతి టీడీపీ అనే మైలేజ్ కోసం ప్రయత్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం తాము దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇచ్చింది టీడీపీ. ఆ ప్రైవేట్ బిల్లుపై చర్చ చేపడతారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఇలాంటి ప్రయత్నాలు చేయలేకపోయారు. కానీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అలా ప్రైవేట్ బిల్లు పెట్టే అవకాశముంది. కానీ ఆయన ఆ పని చేయలేదు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా టీడీపీ మాదిరిగా కాపు రిజర్వేషన్లపై విజయసాయి కూడా ప్రైవేట్ బిల్లు పెట్టి ఉంటే, మా ప్రయత్నం మేం చేస్తున్నాం. కేంద్రం ఇవ్వట్లేదు..అని టీడీపీ మాదిరిగా కాపులకు వైఎస్ఆర్ సీపీ చెప్పుకోగలిగేది. కానీ ఆ ప్రవైట్ బిల్లు పెట్టలేకపోయిన విజయసాయిరెడ్డి మరో రెండు ప్రవైట్ బిల్లులు అదే సమయంలో పెట్టారు. మొదటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సవరణకు చెందినది. ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం అనే పదాన్ని తొలగించాలనేది ఈ బిల్లు ఉద్దేశం. ఈ పదం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులు పరిమితం అవుతున్నాయని, అందుకే సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించాలన్నదే ఆ బిల్లు ఉద్దేశం. రెండో బిల్లు క్రిమినల్ లా (సవరణ)కు సంబంధించినది. వైవాహిక బంధాన్ని కాపాడటం, లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నందున క్రిమినల్ లా లోని 497 సెక్షన్ను సవరించాలనేది ఈ బిల్లు లక్ష్యం .

ఈ రెండు ప్రైవేట్ బిల్లులతో పాటు కాపుల రిజర్వేషన్లపైనా ప్రైవేట్ బిల్లు పెట్టి ఉంటే వైఎస్ఆర్ సీపీకి కాపుల్లో మంచి పేరు వచ్చేదని ఆ పార్టీ కాపునేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ చేసిన పని వైఎస్ఆర్ సీపీ విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేకపోయారో..అని తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -