Friday, May 17, 2024
- Advertisement -

బూతుల జబర్ధస్త్… రామోజీని మినహాయించాలా? రోజా కంటే నాగబాబు తక్కువా?

- Advertisement -

సమాజంలో జరుగుతున్న ఒక తప్పును పెకిలించి వేయాలంటే ముందుగా ఆ తప్పు తాలూకూ వేర్లు ఎక్కడున్నాయో చూడాలి. అలా కాకుండా వేర్లు బలంగా ఉన్నాయని, చెట్టు చాలా బలంగా ఉందని, ఆ బలం మన వర్గం వాళ్ళదనో, మనం మనం బలరంపురం అనే తరహాలోనో చెట్టును వదిలేసి కనీసం కొమ్మలు కూడా కాని ఆకులను పట్టుకుని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? మహా అయితే కత్రినా కైఫ్ బికినీల పుణ్యమాని, రచ్చ రచ్చ చేసిన బూతు సినిమాల పుణ్యమాని కొన్ని రేటింగ్స్, కాసిన్ని డబ్బులు పోగేసుకున్నట్టుగా జబర్ధస్త్ బూతులను మనమూ కాసింత క్యాష్ చేసుకుందాం అన్న తాపత్రయమే జనాలకు కనిపిస్తుంది. ఇప్పుడు జబర్ధస్త్‌ని బ్యాన్ చేయాలి, హైపర్ ఆదిిని ఏదో చేయాలి, అనసూయ రష్మిలను ఆడిపోసుకోవాలి అనే తరహాలో రెచ్చిపోతున్నవాళ్ళందరూ కూడా బూతుల జబర్ధస్త్ షోని వీళ్ళు మరో రకంగా క్యాష్ చేసుకుంటున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

ఆ మాట కొస్తే అసలు ఈ మీడియా ఛానల్స్‌కి జబర్ధస్త్ షోని అనే అర్హత ఉందా? హాలీవుడ్ హీరోయిన్స్ స్కిన్ షో నుంచి, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ స్కిన్ షో వరకూ వీళ్ళు చూపించని బూతు ఏమైనా ఉందా? సినిమా ప్రొడ్యూసర్స్ అన్నా కనీసం హీరోయిన్స్‌కి రెమ్యూనరేషన్స్ ఇచ్చి స్కిన్ షో చేయించుకుంటారు. కానీ ఈ మీడియా వాళ్ళు మాత్రం ఫ్రీగా ఆ బూతును వాడేసుకుంటూ ఉంటారు. ఆ మధ్య వాడెవడో కాజల్ అగర్వాల్ చేత టాప్ లెస్ ఫొటో షూట్ చేయిస్తూ వాడికంటే ఎక్కువగా ఆ ఫొటోలను క్యాష్ చేసుకున్న ఘనులు మన బూతు మీడియా జనాలు. ఇక త్రిష బాత్రూం వీడియా అని, ఇంకా హీరోయిన్స్ పేరుతో ఉండే ఫేక్ వీడియాలను కూడా ఈ బూతు మీడియా సంస్థలు క్యాష్ చేసుకున్నంతగా ఇంకెవ్వరూ క్యాష్ చేసుకోలేదు అన్న మాట నిజం. మీరు బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశారా? అని ఒక మహిళా ప్రజా ప్రతినిధిని అడిగే స్థాయి దరిద్రపు, నీచపు, అమానవీయ బూతు ఛానల్స్ మనవి అనే సగర్వంగా చెప్పుకోవడానికి సందేహించక్కర్లేదు. బూతు ఛానల్స్ అన్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందులో తప్పు కూడా లేదు. బూతులను క్యాష్ చేసుకుంటున్న జబర్ధస్త్ బూతు ప్రోగ్రాం అయితే హీరోయిన్స్ ఫేక్ బూతు వీడియోలను, షకీలా నుంచి సన్నీలియోన్ వరకూ అందరు హీరోయిన్స్ బూతు బొమ్మలను, వీడియోలను ప్రచారం చేసిన, క్యాష్ చేసుకున్న మీడియా ఛానల్స్, పేపర్స్ మాత్రం బూతువి కాకుండా పోతాయా?

బూతులతో, మనిషి రూపురేఖలను ఎటకారం చేస్తూ, అక్రమ సంబంధాల వ్యవహారాలపై వేసే వెకిలి జోకులతో సాగే జబర్ధస్త్ ప్రోగ్రాం తెలుగు ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ స్థాయిని అథమ స్థాయికి దిగజార్చిందనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే అత్యంత టాప్ ర్యాంకింగ్స్‌లో ఉండే వెబ్‌సైట్స్‌లో కొన్ని ట్రిపుల్ ఎక్స్ వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. అంత మాత్రాన ప్రపంచంలోనే ఎక్కువ మంది జనాలు చూస్తున్నారు కాబట్టి మా వెబ్‌సైట్ అధరహో అని వాళ్ళు చెప్పుకోవడంలో అర్థం ఉంటుందా? కాబట్టి మా జబర్ధస్త్ ప్రోగ్రాంని జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి అది సూపర్ నాగబాబు, హైపర్ ఆదిలు చెప్పుకోవడం జబర్ధస్త్‌ని మించిన ఎటకారం అని చెప్పడంలో సందేహం లేదు. ఇక జబర్ధస్త్ వళ్ళే ఎమ్మెల్యేను అయ్యాను అని చెప్పి తన స్థాయిని ఎప్పుడో దిగజార్చుకుంది రోజా. అయితే ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే విమర్శలన్నీ కూడా హైపర్ ఆది, రోజాల చుట్టూ తిరుగుతుండడం.

విమర్శలు చేస్తున్న వాళ్ళ టార్గెట్ అంతా కూడా రోజా, హైపర్ ఆదిలు కావడం. హైపర్ ఆది చేస్తున్నది కచ్చితంగా తప్పే. అలాగే ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ కూడా ఈ స్థాయి జబర్ధస్త్‌లో పార్టిసిపేట్ చేయడం రోజాకు తగదు. కానీ హైపర్ ఆదితో సహా మిగతా చాలా మంది కూడా బ్రతుకుతెరువు కోసం వచ్చినవాళ్ళు. అలాగే ఈ షో ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డిది కూడా తప్పు ఉంది. ఇక మెగా హీరోలు చెప్పినన్ని నీతులు ఇండస్ట్రీలో ఇంకే ఇతర హీరోలు కూడా చెప్పరు. ఆ కోవలోనే నాగబాబు కూడా 2009 ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సందర్భాల్లోనూ ఎన్నో నీతులు చెప్పాడు. జబర్ధస్త్ బూతుల ప్రోగ్రాంకు వచ్చేసరికి ఆ నీతులన్నీ ఏమయ్యాయో తెలియదు మరి. అనాథలపై హైపర్ ఆది అమానవీయ జోకులకంటే కూడా ఆ జోకులకు నాగబాబు పడీ పడీ నవ్వడం…..అంత నవ్వుతూ కూడా……మరీ ఎక్కువ నవ్వస్తున్నాడని హైపర్ ఆదిని పొగుడుతూ……‘ఏయ్….కొంచెం గ్యాప్ ఇవ్వవోయ్……..’ అని అనడం చూస్తే ఆలోచనా పరులకు ఇంకా కంపరమెత్తి పోవడం ఖాయం. అసలు జబర్ధస్త్ షోలో పార్టిసిపెంట్స్ నుంచీ, స్క్రిప్ట్స్ వరకూ అన్నింటినీ పర్యవేక్షించేది నాగబాబే అని……..అన్నింటినీ పెద్దన్నలా, డాడీలా చూసుకుంటూ ఉంటాడని జబర్ధస్త్ పార్టిసిపెంట్సే చెప్పారు. మరి మెగా ఫ్యామిలీ మెంబర్ నాగబాబు ఎందుకు టార్గెట్ అవ్వడం లేదు. ఇక వీళ్ళదరికంటే కూడా దశాబ్ధాలుగా తెలుగు జాతిని తన నీతులతోనే నిలబెడుతున్నానంత స్థాయిలో తన గురించి, తన మీడియా సంస్థల గురించి చెప్పుకునే రామోజీరావును ఎవరూ ఎందుకు ఏమీ అనడం లేదు.

చిత్రం సినిమా తీసినప్పుడు కూడా అప్పటికి మొదటి సినిమా డైరెక్టరే అయిన తేజాను ఎందరో విమర్శించారు. కానీ రామోజీని మాత్రం అదే స్థాయిలో విమర్శించలేకపోయారు. ఎందుకని? ప్రతిఘటన లాంటి సినిమాల క్రెడిట్ మాత్రం ఆ సినిమా తీసిన డైరెక్టర్స్ కంటే రామోజీరావుకే ఎక్కువ ఆపాదిస్తారు. చిత్రం లాంటి సినిమాల బూతు క్రెడిట్ మాత్రం డైరెక్టర్స్‌కి పోతుందా? రామోజీ తప్పు ఏమీ లేదా? సాధారణంగా అయితే కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులైన పద్మ అవార్జులు తీసుకున్నవాళ్ళు ఒక పౌరుడిగా కాస్త ఎక్కువ బాధ్యతగా ఉంటారు. అలా లేని వాళ్ళ నుంచి పద్మ అవార్డుటను వెనక్కు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి పద్మవిభూషణుడు అయిన రామోజీ ఆ నియమాలు వర్తించవా? మోడీ, కెసీఆర్, చంద్రబాబుల భజన చేస్తూ రాజగురువుగా పిలిపించుకుంటూ కోటాను కోట్ల సామ్రాజ్యాలను నిర్మించుకున్న రామోజీరావుకు జబర్ధస్త్ లాంటి బూతు ప్రోగ్రాములతో డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? అన్ని విలువలకూ పాతరేస్తూ డబ్బుల కోసమే బ్రతకాలా? ఇక జబర్ధస్త్ ప్రోగ్రాంపై విరుచుకుపడే టివి9లాంటి సంస్థలు, మేధావులు రామోజీరావును ఎందుకు విమర్శించలేకపోతున్నారు? జబర్ధస్త్‌కి మూలమైన రామోజీరావు నుంచి విమర్శలు మొదలు పెడితే వాళ్ళ డిస్కషన్ షోకు విలువ ఉంటుంది కానీ హైపర్ ఆది లాంటి పిపీలికాన్ని విమర్శిస్తూ పోతే అంతా డ్రామాలా అనిపించదా?

లాస్ట్ పంచ్ః అనాథలపై హైపర్ ఆది జోకులు వేసిన స్కిట్ నుంచి యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. అంటే బజార్‌దస్త్……సారీ…..జబర్ధస్త్ బూతులు శృతిమించాయని ఈటీవీ వారు ఒఫ్పుకున్నట్టేనా? లేక పోలీసు కేసులకు భయపడ్డారా? పోలీసు కేసులకు భయపడడమే నిజమై ఉంటుంది. ఎందుకంటే ఆ మాత్రం విలువలు పాటించే వాళ్ళయితే జబర్ధస్త్ బూతు ప్రోగ్రాములతో డబ్బులు సంపాదించుకోవాలన్న స్థాయికి ఎందుకు దిగజారతారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -