భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం తన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) ద్వారా EOS-09 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం ప్రారంభమైనా, ప్రయాణ సమయంలో లోపం సంభవించింది.
ఇది PSLV సిరీస్‌లో 63వ ప్రయోగం కాగా, భారీ ఉపగ్రహాల నిమిత్తం రూపొందించిన XL కాన్ఫిగరేషన్‌లో 27వది. PSLV-C61 ద్వారా 1,696 కిలోల బరువు గల EOS-09 ఉపగ్రహాన్ని సూర్య సమాంతర ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ రాకెట్ మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి మిషన్ అసంపూర్తిగా ముగిసిందని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. .
ఇది PSLV మిషన్లలో మూడో విఫలం. మొదటిది 1993 సెప్టెంబర్ 20న PSLV-D1 ద్వారా జరిగింది. ఇది ప్రోగ్రామింగ్ లోపం మరియు రిట్రో-రాకెట్ విఫలం చెందడంతో ఫెయిల్ కాగా రెండవది 2017 ఆగస్టు 31న PSLV-C39. ఈ ప్రయోగ సమయంలో పేలోడ్ ఫెయిరింగ్ వేరుచేయడంలో విఫలమైంది.
EOS-09 ఉపగ్రహం ఆధునిక రాడార్ ఇమేజింగ్ సాంకేతికతతో భారత భూ పరిశీలనా సామర్థ్యాలను మెరుగుపరచాల్సి ఉంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే వ్యవసాయం, వనరులు, మట్టిలో తేమ అంచనా మరియు విపత్తు నిర్వహణకు ఉపయోగపడేది. ఈ మిషన్ EOS-04కు కొనసాగింపుగా ప్రయోగించారు.