భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ MIRV టెక్నాలజీతో కూడిన అధునాతన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన సంస్థ DRDO, భారత సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఈ పరీక్ష ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి చేపట్టారు.
MIRV అంటే Multiple Independently Targeted Re-Entry Vehicle . ఈ సాంకేతికత ద్వారా ఒకే క్షిపణి నుంచి అనేక వార్‌హెడ్స్‌ను విడదీసి వేర్వేరు లక్ష్యాలపై దాడి చేయవచ్చు. అంటే ఒకే మిసైల్‌తో అనేక ప్రాంతాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం
ఈ పరీక్షతో భారత్ అత్యాధునిక అణు సామర్థ్య క్షిపణి టెక్నాలజీ కలిగిన కొద్ది దేశాల సరసన నిలిచింది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల వద్ద ఇప్పటికే ఈ తరహా వ్యవస్థలు ఉండగా, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో తన స్థానం మరింత బలపర్చుకుంది.
పరీక్ష సమయంలో క్షిపణి అనేక పేలోడ్లను మోసుకెళ్లి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో విస్తరించి ఉన్న వేర్వేరు లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ట్రయల్ సందర్భంగా అన్ని సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ఈ విజయవంతమైన పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. డీఆర్డీవో శాస్త్రవేత్తలు, భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. దేశ రక్షణ సిద్ధతను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ భారత్ రక్షణ రంగంలో కీలక పురోగతిగా భావిస్తున్నారు. అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో ఇది మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
