తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి అబద్ధాలు అయినా చెప్తుంది అని మండిపడ్డారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎలాంటి మోసాలైనా చేస్తోంది. దీనికి మరో ఉదాహరణ ఇది అని ఆరోపించారు.
స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీరాయితీ గురించి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా గట్టిగా నిలబడాలంటే వాటికి ఇచ్చే వడ్డీ రాయితీ అత్యంత కీలకమని అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం అదే దిశగా వడ్డీ రాయితీ కోసం రూ.4,969 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తన ట్వీట్లో తెలిపారు. అలాగే ఆసరా కార్యక్రమం కింద భారీగా రూ.25,571 కోట్లు, చేయూత కింద రూ.19,189 కోట్లు లబ్ధిదారులపైన మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారని, మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చిన మరెన్నో కార్యక్రమాలను అమలు చేసి, స్వయం సహాయక సంఘాలతోపాటు, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఇవన్నీ వాస్తవ విషయాలు అయినప్పుడు ఇందులో ప్రజలను తప్పుదారి పట్టించడం ఎక్కడుంది?..నేను చంద్రబాబు ని సూటిగా ప్రశ్నిస్తున్నాను …జగన్ లేవనెత్తిన అంశాల్లో ఏ ఒక్కదానిపైనైనా చర్చించడానికి, ఆ లెక్కలు తప్పు అని చెప్పడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు.
1.టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో, ‘స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పథకం వర్తించే రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, ఆ హామీ ఆధారంగా ఓట్లు పొందారన్నది వాస్తవం కాదా?
2.2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, మహిళలను మోసం చేశారన్నది నిజం కాదా?
3.2024–25, 2025–26 సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి ప్రతి ఏటా తగ్గుకుంటూ వచ్చిందన్నది నిజం కాదా?
4.2025–26లో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు ఏడాది వారీగా ప్రతికూల వృద్ధిని, అంటే -3.22% వృద్ధిని నమోదు చేశాయన్నది నిజం కాదా?
వై.ఎస్. జగన్ లేవనెత్తిన అంశాలు ఇవే. కనీసం వీటికి అయినా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందా? పై అంశాలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, ఈ ఆరోపణలు నిజమేనని మీ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టుకాదా? మరి ఇవి వాస్తవాలని అంగీకరిస్తున్న పక్షంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉందంటూ గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటారా? చెప్పాలన్నారు.
