ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్రస్థాయిలో విమర్శించింది. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నిబంధనలు పూర్తిగా పక్కనబెట్టేశారని మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులను ఎలాగైనా జైల్లోనే ఉంచాలనే కుట్రతో ఒక కేసు తర్వాత మరొక అక్రమ కేసు బనాయిస్తున్నారని ఆరోపించారు. తనపై ఏకంగా 27 అక్రమ కేసులు నమోదు చేశారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ వంటి నాయకులపై కూడా కేవలం ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ ఆధారంగానే తప్పుడు కేసులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో పాత కేసులను తవ్వి తీయడం లేదా కొత్తగా తప్పుడు ఫిర్యాదులు సృష్టించడం పరిపాటిగా మారిందని, టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడం ఆలస్యం పోలీసులు వెంటనే స్పందించి కేసులు పెట్టడం ఒక ప్రహసనంలా సాగుతోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసిన కాకాణి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి వెళ్లిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి, ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ మూడు నెలల పాటు జైల్లో బంధించారని మండిపడ్డారు. సాయి కృష్ణ మృతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాతే చంద్రబాబు నాయుడు స్పందించి, సాయి కృష్ణ తల్లిని కలవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.
ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కేవలం పేరుకే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని కాకాణి విమర్శించారు. లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించి పథకాన్ని పూర్తిగా నీరుగార్చారని, కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో అర్హులైన ప్రతి రైతుకూ నేరుగా లబ్ధి చేకూరడమే కాకుండా పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (RBK) వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు పక్కనబెట్టి, ప్రజల సంక్షేమం మరియు రైతుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
