- Advertisement -

భర్తను చంపిన భార్య.. సహకరించిన అధికారులు, వైద్యులు!

- Advertisement -

ఇటీవ‌ల డబ్బుల కోసం సొంత వాళ్ల‌ను దారుణంగా చంపుతున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నాం. తాజాగా రూ. 2 కోట్ల బీమా సొమ్ము కోసం తన భర్త, మాజీ సైనికుడు సందీప్‌ను భార్య సుమ తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో కుట్రకు సహకరించిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక వైద్యుడితో కలిపి మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బెళగావి ఎస్పీ భీమా శంకర గుళేద్ తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ కలగౌడ మంజరగి (46) అనే మాజీ సైనికుడు మార్చి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హుక్కేరిలోని ఒక ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో మార్చి 15న భార్య సుమ, ఆమె ప్రియుడు పుండలీక డొంబర్ కలిసి ఆయనకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్‌లో విషాన్ని కలిపారు. దీనివల్ల సందీప్ మరణించారు. రోడ్డు ప్రమాదం వల్లే ఆయన చనిపోయారని అందరినీ నమ్మించి, నిందితులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే, సందీప్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొదట సుమ, పుండలీకలను అరెస్టు చేశారు. వారిని విచారించగా, ఈ హత్య వెనుక ఉన్న భారీ కుట్ర బయటపడింది. హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి, బీమా సొమ్ము క్లెయిమ్ చేయడానికి వీరికి పలువురు ప్రభుత్వ అధికారులు, వైద్యులు సహకరించినట్లు తేలింది.

ఈ కేసులో నిందితులుగా ఆర్‌ఎంపీ వైద్యుడు బసవరాజ భస్మె, బెళగావి కమిషనర్ కార్యాలయ ఎఫ్‌డీఏ అశోక గుజనాళ, ఫోరెన్సిక్ ప్రయోగశాల గుమస్తా అప్పాసాహెబ్ నాయక, ల్యాబ్ అసిస్టెంట్ అడవి స్వామిమఠ్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పీఎన్ నాగరాజ్, పుండలీక స్నేహితులు సేలార, రాహుల్ జోగిలను పోలీసులు గుర్తించారు. వీరందరినీ అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -