విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యం ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని… అసలు సాయికృష్ణ బతికున్నాడా? లేక చనిపోయాడా? అనే ప్రాథమిక విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు తేల్చలేకపోతోందని నిలదీశారు. బాధితుడి ఆచూకీపై అధికారికంగా తక్షణమే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఒక పౌరుడి ప్రాణాల పట్ల మరియు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ కేసు ఇంతటి మిస్టరీగా మారిందని మండిపడ్డారు.
ఈ కేసు దర్యాప్తులో పోలీసుల తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందన్న పేర్ని నాని, బాధితుడి తల్లిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కలిసి పరామర్శించిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని గుర్తుచేశారు. జగన్ పర్యటన తర్వాతే పోలీసులు దిగివచ్చి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారంటే, రాష్ట్రంలో చట్టం ఏ విధంగా నిర్వీర్యమైందో అర్థమవుతోందన్నారు. ఒక సామాన్య యువకుడు కనిపించకుండా పోతే కేసు నమోదు చేయడానికి పోలీసులకు ఏకంగా 40 రోజుల సుదీర్ఘ సమయం ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా విజయవాడ పోలీస్ కమిషనర్ (CP) పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ టాస్క్ఫోర్స్ విభాగానికి విజయవాడ సీపీనే ప్రత్యక్ష అధిపతి అని స్పష్టం చేశారు. స్వయంగా సీపీ పరిధిలోని విభాగమే ఈ ఆపరేషన్ చేసినప్పుడు, ఈ కేసులో ఇప్పటివరకు ఆయన్ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. ఈ అదృశ్యం వెనుక అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని…. పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా, సాయికృష్ణ ఆచూకీని కనిపెట్టి, ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
