ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులు, బహుజనులపై దాడులు, వేధింపులు మితిమీరిపోయాయని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైఎస్సార్సీపీ దళిత నాయకుడు జడ సురేంద్రను పరామర్శించారు.
సురేంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం, సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు.ఈ సభ్య సమాజంలో ఒక దళితుడు గౌరవంగా వ్యాపారం కూడా చేసుకోవడానికి వీల్లేదు అని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించింది” అని సుధాకర్ బాబు మండిపడ్డారు. దళితుడైన మంద సాల్మన్‌ను దారుణంగా నరికి చంపిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు జడ సురేంద్రను మానసికంగా చంపే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అండదండలతోనే దళితులపై ఇటువంటి దాడులు, వేధింపులు సాగుతున్నాయని దుయ్యబట్టారు.
పిడుగురాళ్ల పట్టణ సీఐ వెంకట్రావుపై సుధాకర్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐ వెంకట్రావు చట్టాన్ని పక్కనబెట్టి, పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. స్టేషన్ వేదికగా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తూ దళిత నాయకుడు జడ సురేంద్రను తీవ్రంగా వేధించారు. ఆ వేధింపులు భరించలేకే సురేంద్ర ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ప్రైవేట్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న సీఐ వెంకట్రావును తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. పంతానికి, పౌరుషానికి గడ్డయిన పల్నాటి నేలపై తాము పుట్టామని.. మాల కన్నమదాసు వారసులమనే విషయం ఇక్కడి పాలకులు మర్చిపోవద్దని హెచ్చరించారు.
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారని..ఈరోజుకి కూడా ఆయన మృతదేహం ఎక్కడ ఉందో కనిపించని దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేరుపోగు క్రాంతి కుమార్‌ను సీఐ నాగరాజు దారుణంగా వేధించడంతోనే ఆయన అన్యాయంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడుతున్నారనే ఒకే ఒక్క కారణంతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మరియు మైనార్టీలను ఈ ప్రభుత్వం పథకం ప్రకారం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని సుధాకర్ బాబు ఆరోపించారు.
