ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా క్షీణించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లీగల్ సెల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
సాయికృష్ణ, క్రాంతి కుమార్‌ల మరణాలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా దిగజారిందో, అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంగా ఎలా మారిందో స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. మొదట వైఎస్సార్‌సీపీ నాయకులను, ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య పౌరులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేవలం ఒక్క పోలీసు అధికారి చర్య కాదని, ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఇలాంటి ఘోరాలు జరగవని చెప్తూ.. దీనిపై తక్షణమే సిబిఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అలాగే పోలీసులు పెట్టిన చిత్రహింసలపై క్రాంతి కుమార్ మరణానికి ముందు విడుదల చేసిన వీడియో సాక్ష్యంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అధికార పార్టీ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పోలీసులు బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో బాధితులకు కనీసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే అవకాశం కూడా దక్కడం లేదని, గాయపడిన వారికి వైద్యం అందకుండా, చట్టపరమైన రక్షణ లేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులందరికీ న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ సిద్ధంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ లీగల్ సపోర్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ చట్టపరమైన, ప్రజాస్వామ్య పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు.
