తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ అందించింది. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను పలు సందర్భాల్లో రద్దు చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది తిరుమలలో రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ కు నిర్ణయించారు. ప్రస్తుతం కొనసాగుతన్న రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమలకు ప్లాన్ చేసుకున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందిస్తోంది. జూలై నుండి సెప్టంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు ప్రకటించింది. జూలై నెల నుండి సెప్టంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ప్రకటించింది. బ్రేక్ దర్శనాల రద్దుతో పాటుగా కారణాలను వివరించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా సెప్టెంబరు 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తో సహా సెప్టంబర్ 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ తేదిలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ కోరుతోంది.
