మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనలతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించారు, ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. 2011 కంటే ముందు నుంచి టీచర్లుగా సేవలు అందిస్తున్న వారికి కూడా టెట్ పరీక్ష తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసారు.
వారి సమస్యలను వివరిస్తూ జగన్ చేసిన ట్వీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. అందులో..” చంద్రబాబు గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టని..” ప్రశ్నించారు.
అదే విధంగా.. టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కాని, చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయిందని.. మండిపడ్డారు. 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని జగన్ డిమాండ్ చేసారు.
