ఏపీ మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెరిఫికేషన్‌లో ఒక్కో కేసులో ఒక్కో విస్మయకర నిజం బయటపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఈ నియామక ప్రక్రియలో జరుగుతున్న మోసాలను ఉదాహరణలతో వివరించారు. మొదటి దశలో విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లే కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే వారు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ నకిలీదని తేలిందని తెలిపారు. ఇక నాగార్జున యూనివర్సిటీని ఆరా తీస్తే అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని స్పష్టమైందని జగన్ సంచలన విషయాలు వెల్లడించారు.
ఏడు దశల్లో కఠినంగా వెరిఫికేషన్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారని, అసలు ఏం పరిశీలించారని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి పద్ధతిలో సాగుతున్న రిక్రూట్‌మెంట్‌ను నిష్పక్షపాతమైన, పారదర్శకమైన ప్రక్రియగా ఎలా పిలుస్తారని నిలదీశారు. ఈ లొసుగులు, లోపాలే డీఎస్సీలో భారీ అక్రమాలకు తావిచ్చాయని స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కుంభకోణానికి సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ పోస్ట్ చేశారు.
