దక్షిణ ఆసియాలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశం సహా పలు దేశాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉండగా మహారాష్ట్రలో 6,066 స్వాబ్ పరీక్షలలో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 101 కేసులు ముంబైనుండే రావడం గమనార్హం. మిగిలిన కేసులు థానే, పుణె, కొల్హాపూర్‌లలో నమోదయ్యాయి.
జనవరి నుండి ఇప్పటివరకు కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించగా, అందులో ఒకరు క్యాన్సర్ రోగిగా ఉన్నారు. పరిస్థితి అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు లేదా జలుబు, దగ్గు, జ్వర లక్షణాలతో ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆసుపత్రులను సూచించింది.
సింగపూర్ లో ఏప్రిల్ చివరిలో 11,000 కేసుల నుంచి మే ప్రారంభంలో 14,000 కంటే ఎక్కువకు చేరాయి. హాంగ్‌కాంగ్ లో మే మొదటి వారం లోపల 1,000+ కేసులు మరియు 33 మరణాలు నమోదయ్యాయి. చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండగా ఫ్లూ లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ తాజా వేవ్‌కు JN.1 వేరియంట్ మరియు దాని ఉపవేరియంట్లు అయిన LF.7, NB.1.8 లు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.