Friday, May 17, 2024
- Advertisement -

టీ కాంగ్రెస్సా…రేవంత్ కాంగ్రెస్సా!

- Advertisement -

నిప్పు లేకుండా పొగ వస్తుందా..?అంటే కష్టమే. మరీ రాజకీయాల్లో అయితే చెప్పనక్కర్లేదు. కానీ టీ కాంగ్రెస్‌లో ఎప్పుడు తుపానే. అయితే ఎంతమంది నేతలు పార్టీ వీడినా తట్టుకుని నిలబడింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీ వీడుతున్న నేతల టార్గెట్ అంతా రేవంత్ రెడ్డే. ఆయన ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకపోతున్నామని అందుకే పార్టీని వీడుతున్నామని చెబుతున్నారు నేతలు.

తాజాగా మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్‌ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌తో తన 45 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. ఇందుకు కారణం రేవంత్ రెడ్డేనని పార్టీలో బీసీల అణచివేతకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. వాస్తవానికి పార్టీని వీడుతున్న నేతలంతా చెప్పేది ఒక్కటే రేవంత్ రెడ్డిని మార్చాలని…పార్టీని బ్రతికించాలని.

సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీని వీడినా రేవంత్ మాత్రం లైట్‌ తీసుకుంటున్నారు. తన పని తాను చేసుకుపోతున్నారు. తన వర్గం వారికే పార్టీ పదవులు కట్టబెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక కొంతమందిని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ పొమ్మన లేక పొగ బెడుతున్నారా అని అంటే ఈ ఆరోపణ సైతం వచ్చింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి వ్యతిరేకంగా రేవంత్‌ అనుకూల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగింది. దీనిని ఆ నేతలు తప్పుబట్టి రేవంత్‌పై విమర్శలు గుప్పించారు కూడా. అయితే రేవంత్ మాత్రం మరికొంతమంది నేతలు పార్టీని వీడితే కాంగ్రెస్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించొచ్చని భావిస్తున్నారట. అందుకే రానున్న రోజుల్లో టీ కాంగ్రెస్ కాస్త రేవంత్ కాంగ్రెస్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రేవంత్‌తో పాటు టీడీపీ నుండి వచ్చిన నేతలు ఆయన వెంటే నడవనుండగా ఆయన తీరు నచ్చని నేతలు మాత్రం పార్టీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక పొన్నాల బాటలోనే మరికొంతమంది బీసీ నేతలు కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతుండగా రేవంత్ వర్గం దీనిని ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచిచూడాలి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -