స్టార్ హోటళ్లే లక్ష్యంగా దర్జాగా తిరుగుతూ బిల్లులు కట్టకుండా ఉడాయిస్తున్న 69 ఏళ్ల వృద్ధుడిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన బింగ్సన్ జాన్ అనే వ్యక్తి గత 36 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సుమారు 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసం చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది. యోగా శిక్షకుడు లేదా ఇంగ్లిష్ టీచరు లేదా ఫారిన్ టూర్ గైడుగా నటిస్తూ ఇతను హోటళ్లలో బస చేసేవాడు.
రాయ్‌పూర్‌లోని హయత్ ఫైవ్‌స్టార్ హోటలులో జూన్ 25న జాన్ ప్రవేశించాడు. దర్జాగా రెండు రోజులు గడిపి ఎవరికీ అనుమానం రాకుండా జూన్ 27న అదృశ్యమయ్యాడు. హోటలుకు చెల్లించాల్సిన రూ.63,755 బిల్లును ఎగవేసాడు. హోటలు నిర్వాహకుల నుంచి తనకు అవసరమని చెప్పి రూ.1.48 లక్షల విలువైన ల్యాప్టాపును కూడా అపహరించాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
చెక్-ఇన్ సమయంలో ఇతను అందించిన డాక్యుమెంట్లు అలాగే మొబైల్ నంబర్లను రాయ్‌పూర్ పోలీసులు సాంకేతికంగా విశ్లేషించారు. నిందితుడు భువనేశ్వర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేర ప్రస్థానం గురించి వెల్లడించిన వివరాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఇతనిపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి. తిహాడ్ జైలుతో సహా పలు జైళ్లలో ఇతను సుమారు 15 ఏళ్లకు పైగా శిక్షను అనుభవించాడు.
ప్రఖ్యాత సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని నిందితుడు చెప్పాడు. అతని పద్ధతులను స్ఫూర్తిగా తీసుకుని హోటళ్లలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. విలువైన వస్తువులను దొంగిలించడం ఇతనికి అలవాటుగా మారింది. ఒక ప్రాంతంలో నేరం చేసిన తర్వాత మరొక రాష్ట్రానికి ఉడాయించడం ఈయనకు పరిపాటి. ప్రస్తుతం రాయ్‌పూర్ పోలీసులు నిందితుడిని కటకటాల్లోకి పంపారు. ఇతని గత నేర చరిత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
