మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శుక్రవారం జరిగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది.
వివరాళ్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. గతేడాది మే 11న రాజాకు సోనమ్‌తో వివాహం జరిగింది. 20వ తేదీన నవ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ వారు అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహం సోహ్రాలోని జలపాతం సమీపంలో లోయలో లభ్యమైంది. మృతదేహంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా ధ్రువీకరించారు. జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్‌లో సోనమ్ ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఆమెతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏప్రిల్‌లో షిల్లాంగ్ న్యాయస్థానం సోనమ్‌కు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల అరెస్టు మెమోలో సాంకేతిక లోపం దొర్లడంతో ఆమెకు ఊరట లభించింది. ఈ బెయిల్‌ను మేఘాలయ హైకోర్టు కూడా సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నేటి విచారణలో ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇటువంటి నేర ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఆమె బెయిల్ రద్దు విషయంలో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితురాలు విడుదలైన నేపథ్యంలో కఠినంగా వ్యవహరించకూడదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
